యాప్‌ పేరుతో దోపిడీ.. 4215 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు

*ఫాల్కన్ యాప్ పేరుతో 4,215 కోట్ల మోసం కేసులో సంచలనం

*ఫాల్కన్ గ్రూప్ సీఓఓ ఆర్యన్ సింగ్‌ను అరెస్టు చేసిన తెలంగాణ సీఐడీ

హైదరాబాద్: సంచలనాత్మక ₹4,215 కోట్ల ఫాల్కన్ యాప్ స్కామ్‌లో తెలంగాణ సీఐడీ పోలీసులు పురోగతి సాధించారు.  టీమ్‌ ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)ఆర్యన్ సింగ్‌ను ఆదివారం తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఆర్యన్ సింగ్‌ను జూలై 4న పంజాబ్‌లోని భటిండాలో అరెస్టు చేసి, ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్‌కు తరలించారు. తరువాత ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు సీఐడీ అధికారి సిన్హా  ధృవీకరించారు.

ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్‌ను క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ ద్వారా రూపొందించారు. ఇది ప్రఖ్యాత బహుళజాతి సంస్థల పేరుతో  పెట్టుబడి పథకాలను విస్తృతంగా ప్రచారం చేసిందని సీఐడీ తెలిపింది. మోసపూరిత ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ ద్వారా అధిక రాబడి హామీలతో ఈ యాప్‌తో  నిందితులు పెట్టుబడిదారులను ఆకర్షించారు.

దేశవ్యాప్తంగా 7 వేల మందికి పైగా వ్యక్తుల నుండి డిపాజిట్లు సేకరించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ఈ కుంభకోణంలో మొత్తం ₹4,215 కోట్ల పెట్టుబడులు స్వీకరించినట్టు గుర్తించారు. దాదాపు 4,065 మంది బాధితులు ₹792 కోట్లు మేర నష్టపొయినట్టు గుర్తించారు. ఇప్పటివరకు, సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్‌లో నమోదైన మూడు ఎఫ్ఐఆర్‌లను సీఐడీకి బదిలీ చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయని  సీఐడీ తెలిపింది.

ఐదవ నిందితుడిగా  ఆర్యన్ సింగ్‌ను గుర్తించారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అమర్‌దీప్ కుమార్‌తో పాటు ఆర్యన్‌సింగ్‌ కీలక పాత్ర పోషించినట్టు భావిస్తున్నారు.  బాధితులతో నేరుగా సంభాషించడం, నకిలీ రసీదులు జారీ చేయడం వంటి అక్రమ కార్యకలాపాలతో 14.35 కోట్ల విలువైన డిపాజిట్లను సేకరించారన్న ఆరోపణలు సింగ్‌పై ఉన్నాయి. కంపెనీ నిధుల నుండి 1.62 కోట్లను తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

ఈ కుంభకోణం బయటపడిన తర్వాత, సింగ్ మొదట నాందేడ్‌కు పారిపోయి అక్కడ నుంచి బతిండాకు వెళ్లినట్టు గుర్తించారు. అక్కడ ఒక గురుద్వారాలో బస చేశాడని సీఐడీ అధికారులు చెప్పారు. అతన్ని అక్కడ అరెస్టు చేసి రెండు మొబైల్ ఫోన్లు మరియు కీలకమైన పత్రాలను అతని వద్దనుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు పది మంది వ్యక్తులను అరెస్టు చేశామని అధికారులు  తెలిపారు. మిగిలిన నిందితులను పట్టుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది.