
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించారు. అందులో భాగంగా సీఎం హెలికాప్టర్ లో పర్యటిస్తూ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆయన సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి జలాలను తెలంగాణలో ఎక్కడికి తరలించాలన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాణవాయువు లాంటిదని అన్నారు. స్ట్రాటజిక్ లొకేషన్ తో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి అని.. కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే ఎల్లంపల్లి దశాబ్దాలుగా నిలబడిందని ఆయన పేర్కొన్నారు.
మేడిగడ్డ విషయంలో సాంకేతిక కమిటీ సూచనల ప్రకారం వెళ్తాం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించే ముందుకెళ్తాం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. వరద పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం రేవంత్ వారికి పలు సూచనలు చేశారు.