
తెలంగాణ: ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రెండు అవిభక్త కవలల్లాంటివన్నారు. ఉస్మానియా వర్సిటీలో రూ. 90 కోట్లతో నిర్మించిన భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దుందుభి, బీమా వసతి భవనాలను ప్రారంభించిన అనంతరం డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వేం నరేందర్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, ఓయూ వీసీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… పీవీ నరసింహారావు, చెన్నారెడ్డి, జైపాల్‌రెడ్డి, ఉస్మానియా నుంచి వచ్చిన వారే అన్నారు. తెలంగాణలో ఉద్యమానికి ఉస్మానియా వర్సిటీ పురిటిగడ్డ అన్నారు. చదువుతో పాటు పోరాటాన్ని నేర్పింది ఉస్మానియానే. యాదయ్య.. తెలంగాణ కోసం అమరులయ్యారు. ఈ వర్సిటీ ఎందరో ఐపీఎస్, ఐఏఎస్‌లను అందించింది.
ఉస్మానియాకు గొప్ప చరిత్ర ఉంది. వందేళ్లలో ఓయూకు వీసిగా దళితుడిని నియమించింది కాంగ్రెసే. గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలనుకున్నారు. ఉస్మానియా వర్సిటీలో చదువుకున్న వారికి చాలా అవకాశాలు వచ్చాయి. యువ నాయకత్వం దేశానికి అవసరం ఉంది. దేశానికి అతిపెద్ద సంపద యువతే.
విద్యార్థులకు నేను ఇచ్చేది నాణ్యమైన విద్య మాత్రమే. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం. నేనే సీఎం అయ్యాక సామాజిక బాధ్యతగా వర్సిటీలకు వీసీలను నియమించాను. చదువు ఒక్కటే అన్నింటికీ పరిష్కారం అన్నారు. డిసెంబర్ లో ఆర్ట్స్ కళాశాల వద్ద సభ పెడితే నేను వస్తా. అన్ని పనులు మంజూరు చేస్తా. ఒక్క పోలీసును కూడా క్యాంపస్ లో ఉంచొద్దు. ఒక వేళ విద్యార్థులు నన్ను అడ్డుకొని ప్రశ్నిస్తే చిత్తశుద్ధితో సమాధానం చెబుతానని ఆయన అన్నారు. ఉస్మానియా వర్సిటీని ఆక్స్‌ఫర్డ్ స్ధాయిలో అభివృద్ధి చేసేందుకు నేను సిద్శం. అందుకోసం నిపుణలతో కమిటీ వేయండి. నిధులు సమకూర్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని రేవంత్ అన్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వేగంగా విస్తరిస్తోందని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. యువతను డ్రగ్స్, గంజాయి పట్టి పీడిస్తున్నాయని ఆవేదన చెందారు. విద్యా సంస్థల్లో చైతన్యవంతమైన చర్చలు లేక పోవడంతో డ్రగ్స్ సమస్య ఉత్పన్నవుతుందన్నారు. చిన్న కాలేజీల్లో సైతం విద్యార్థులు గంజాయికి అలవాటుపడుతున్నారని ఆయన తెలిపారు.