
తెలుగు రాష్ట్రాలను మరోసారి వర్షాలు వణికిస్తున్నాయి. గత రెండు రోజుల నుండి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్,యదాద్రి జిల్లాల్లో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగుతున్నాయి.
కామారెడ్డి జిల్లాలో పోచారం డ్యామ్ కు వరద పొటెత్తింది. నిన్న భారీవరదకు పోచారం డ్యామ్ కు గండి పడింది. హవేలీ ఘన్ పూర్ మండలం సర్దన, జక్కన్నపేట గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పోచారం డ్యామ్‌కు ఎటువంటి నష్టం కలగలేదని చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ అన్నారు. కనీవినీ ఎరుగని వరదను పోచారం డ్యామ్ తట్టుకుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. 103 ఏళ్ల చరిత్ర ఉన్న డ్యామ్ భారీ వరదను తట్టుకుందని ఆయన అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరాలో వాగులు పొంగిపోర్లుతున్నాయి. వైరా జలాశయం సామర్థ్యానికి మించి ప్రవహిస్తుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. వైరా జలాశయం అలుగుపారడంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుకుంది. తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 44 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పాలేరు జలాశయానికి 1, 769 క్యూసెక్కుల వరద నీరు చేరుకుంది. కిన్నెరసాని ప్రాజెక్టుకు 5 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుకుంది. కిన్నెరసాని నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.