వర్షాకాలం దోమలతో జాగ్రత్త

వర్షాకాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ దోమలు విజృంభిస్తాయి. ఈ సీజన్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరల్ ఫీవర్ బారిన పడక తప్పదు. వర్షాకాలంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం, మురికి కాలువలు మూసుకుపోవడం, నిలిచి ఉన్న నీరు, అధిక తేమ వల్ల దోమలు పెరిగిపోతాయి. ప్రతి సంవత్సరం డెంగ్యూ నివారణ కోసం ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఈ సీజన్ వ్యాధులు జనాలను బెంబేలెత్తిస్తూనే ఉన్నాయి. కాబట్టి, డెంగ్యూ బారిన పడకుండా సురక్షితంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటించాల్సిందేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

జాగ్రత్తలు:
*దోమల కాటు నుంచి రక్షణ పొందేందుకు శరీరం మొత్తం పూర్తిగా కప్పి ఉంచేలా బట్టలు ధరించాలి.
*దోమ కాటు నివారణకు క్రీములు వాడాలి.

  • ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, కిటికీలు, తలుపులకు దోమలను అడ్డుకునేలా జాలీలు వేయాలి.
  • ఇంటి బయట గడ్డి, చెత్త, ఆకులు వంటి దోమల సంతానోత్పతికి అనుకూలమైన ప్రాంతాలను తరచూ క్లీన్ చేయాలి.
  • ఇంట్లో మస్కిటో రిపెలెంట్లు, కాయిల్స్ వాడాలి. అవసరమైతే మున్సిపాలిటీ ద్వారా దోమల మందులు కొట్టించాలి.
  • ఉదయం 6 నుంచి 10 మధ్య, సాయంత్రం 4 నుంచి 7 మధ్య డెంగ్యూ దోమలు చురుగ్గా ఉంటాయి. ఈ సమయంలో దోమలు కుట్టకుండా జగ్రత్తలు వహించాలి.
  • పిల్లలు బయటకు ఆడుకోవడానికి వెళ్లేటప్పుడు రిపెలెంట్లు, ఫుల్ డ్రెస్సింగ్ ఉండేలా చూడాలి.
  • జ్వరం వస్తే తప్పక డాక్టర్ సలహా తీసుకోవాలి.

డెంగ్యూ లక్షణాలు

అకస్మాత్తుగా తీవ్ర జ్వరం, తీవ్ర ఒళ్ళు నొప్పులు, తల నొప్పి, ఉబ్బసం, వాంతులు, అలసట, ఆకలిగా అనిపించకపోవడం, చర్మంపై ఎర్రటి రాషెస్, మూత్రంలో, వాంతి, ముక్కులో రక్తస్రావం, దంతాల నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటాయి. జ్వరం 3 రోజులకు పైగా ఉంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి.