కిల్లర్ మూవీ కోసం స్టార్ మూజిక్ డైరెక్టర్..!

దక్షిణాది సినిమా స్టార్ ఎస్.జె. సూర్య పదేళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు! ‘కిల్లర్’ పేరుతో స్వీయ దర్శకత్వంలో, హీరోగా నటిస్తూ ఈ పాన్-ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర్ రంగంలోకి దిగబోతున్నారు.

దక్షిణాది సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఎస్.జె. సూర్య… విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎలాంటి పాత్రలోనైనా తనదైన శైలితో అలరిస్తున్నాడు. ‘స్పైడర్’, ‘సరిపోదా శనివారం’, ‘గేమ్ చేంజర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సూర్య, తమిళంలోనూ ‘మానాడు’, ‘మార్క్ ఆంటోని’ వంటి చిత్రాలతో సత్తా చాటాడు. కానీ, ఈ స్టార్ నటుడు గతంలో దర్శకుడిగా సూపర్ హిట్స్ అందించాడన్న సంగతి చాలామంది మర్చిపోయారు. ఇప్పుడు, పదేళ్ల తర్వాత సూర్య మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. వాలి, ఖుషి లాంటి బ్లాక్ బస్టర్లు అందించిన ఘనత సూర్య సొంతం.

తెలుగులో డిజాస్టర్ అయిన ‘నాని’ సినిమాతో తమిళంలో తనే హీరోగా ‘న్యూ’ పేరుతో రూపొందిస్తే అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అంతకుముందే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా.. ‘న్యూ’తో నటుడిగా వచ్చిన గుర్తింపుతో అతను యాక్టింగ్‌లో బిజీ అయిపోయాడు. క్రమంగా దర్శకుడిగా సినిమాలు తగ్గించేసి నటుడిగా స్థిరపడిపోయాడు. చివరగా 2015లో ఇసై అనే సినిమాను డైరెక్ట్ చేసిన సూర్య..పదేళ్ల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టబోతుండడం విశేషం.

సూర్య తనే హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా..కిల్లర్. ఓ పెద్ద నిర్మాణ సంస్థతో కలిసి సూర్య ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అంతకుముందు సూర్య డైరెక్ట్ చేసిన నాని, న్యూ, పులి లాంటి చిత్రాలకు సంగీతం అందించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్… తన కొత్త చిత్రానికీ పని చేయబోతున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయలో తెరకెక్కబోతోంది. ఈ సినిమా కోసం కొంత కాలం నటుడిగా వేరే చిత్రాలేవీ చేయబోవట్లేదు సూర్య. మరి పదేళ్ల తర్వాత దర్శకుడిగా సినిమా తీస్తూ సూర్య ఏమేర మెప్పిస్తాడో చూడాలి.