పవన్‌ కళ్యాణ్‌గారూ.. గిరిజన బిడ్డలం మమ్మల్ని పట్టించుకోండి!

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చొరవతో కొన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించారు. అయితే.. అల్లూరి జిల్లా హుకుంపేట మండలం తీగల పంచాయతీలోని  పంతలచింత గ్రామంలో పాఠశాల లేకపోవడంతో సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న తడిగిరి పంచాయితీ ముల్లు పేటలోని పాఠశాలకు చిన్నారులు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 

ప్రాణాలు పణంగా పెట్టీ వాగులు, గెడ్డలు దాటి పక్క పంచాయతీకి పాఠశాలలకు వెళ్తున్న చిన్నారి బాలలు తమ గోడు వినిపించుకోవాలని డిప్యూటీ సీం పవన్‌కళ్యాణ్‌కు విన్నవించుకుంటున్నారు. వారు వెళ్లే మార్గమధ్యలో ప్రమాదకరమైన వాగులు, కొండలు దాటి వెళ్లి రావాల్సి ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పటి నుంచో తమ గ్రామంలో పాఠశాల నిర్మించాలని ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా.. కనీసం పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు. ప్రమాదంతో కూడిన ప్రయాణం చేసి పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతారో లేదో తెలియడం లేదని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.