
అమలాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ బట్టల షాపు యజమానికి విద్యుత్ శాఖ అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. షాపు యజమానికి ఒక్కసారిగా 3 లక్షల 38 వేల రూపాయల కరెంటు బిల్లు రావడంతో షాక్‌కు గురయ్యాడు.
మల్కిపురం సెంటర్‌లో ఒక చిన్న షాపులో బట్టలు వ్యాపారం చేస్తున్న కుంపట్ల యువకుమార్ షాపుకు ప్రతినెలా 400 నుండి 700 రూపాయల మధ్య విద్యుత్ బిల్లు వస్తుండేది. జూలై నెలకి ఏకంగా 3 లక్షల 38 వేల రూపాయలు బిల్లు రావడంతో యువకుమార్ బెంబేలెత్తిపోయాడు. ఇదేం కరెంటు బిల్లు అంటూ
విద్యుత్ శాఖ అధికారులతో మొరపెట్టుకొన్నాడు. కస్టమర్‌కేర్ నెంబర్‌కి ఫిర్యాదు చేస్తే.. స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలని సూచించి చేతులెత్తేశారు.
తనలాగే కొందరు చిరు వ్యాపారులకు లక్ష రూపాయలకు పైగా కరెంట్ బిల్లు వచ్చిందని బాధితుడు వాపోయాడు. ఇలాంటి పొరపాట్లు చేసి తమకు షాక్ ఇస్తే ఎలా చిరు వ్యాపారులు లబోదిబో అంటున్నారు.