తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే రెండు రోజుల్లో వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడనుంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని ఉత్తర కోస్తాలో జోరుగా వానలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. విశాఖను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గడిచిన 12 గంటల్లో పెదగంట్యాడ, భీమిలి, ఆనందపురం, మహారాణిపేటలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఎడతెరిపిలేని వర్షాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదకర హోర్డింగ్‌లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలిని అనిత ఆదేశించారు.