భారత్ ను దూరం చేసుకోవద్దు – నిక్కీ హేలీ

సుంకాల పేరుతో భారత్ ను అకారణంగా ఇబ్బందులకు గురి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి యూఎస్ మాజీ రాయబారి నిక్కీ హేలీ ట్రంప్ ప్రభుత్వాని హెచ్చరించారు. భారత్ ను దూరం చేసుకోవద్దని ఆమె హితవు పలికారు. ఈ మేరకు ఆమె ఓ వార్త పత్రికలో రాసిన ఓ వ్యాసంలో ఈ అంశాన్ని వ్యాఖ్యానించారు. సుంకాలు, రష్యా చమురు వివాదాలతో రెండు దేశాల మధ్య దూరం పెరగకుండా ట్రంప్ జాగ్రత్త పడాలని ఆమె అన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు తెగే వరకు చేరుకున్నాయని ఆమె అన్నారు.

చైనాను కట్టడి చేయడమే అమెరికా లక్ష్యం అయితే భారత్ తో సంబంధాలు వెంటనే పునరుద్ధరించాలని ఆమె సూచించారు. ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యాల గురించి మర్చిపోవద్దని ఆమె గుర్తుచేశారు. చైనాను ఎదుర్కొనేందుకు భారత్ లాంటి మిత్ర దేశం అవసరం ఉందని నిక్కీ హేలీ అన్నారు. రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడం ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థిక ఇంధనంలా మారిందని అన్నారు. అయితే భారత్ ను ప్రత్యర్థిగా చూడవద్దని ట్రంప్ ప్రభుత్వానికి ఆమె సూచించారు. 25 ఏళ్ల అమెరికా, భారత్ మధ్య స్నేహాన్ని బలహీనపరిస్తే పెద్ద తప్పు అవుతుందని ఆమె హెచ్చరించారు. అమెరికా ఆర్థిక, రక్షణ రంగ లక్ష్యాలకు భారత్ అత్యవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

చైనాను దాటి వస్తు ఉత్పత్తి చేయాలనుకుంటున్న అమెరికాకు భారత్ అవసరం ఎంతైనా ఉందని నిక్కీ హేలీ అన్నారు. చైనా స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం భారత్ కు ఉందన్నారు. భవిష్యత్ లో భారత్ ఆర్థికాభివృద్ధి చైనాను అధిగమిస్తుందని ఆమె పేర్కొన్నారు. దౌత్య సంబంధాల్ని సరిదిద్దేందుకు ఇరు దేశాధినేతలు మధ్య నేరుగా చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.