
ఢిల్లీ: జీఎస్టీ సంస్కరణల విషయంలో కీలక ముందడుగు పడింది. పరోక్ష పన్నుల విధానంలో 2 శ్లాబులు ఉంచాలన్న కేంద్రం ప్రతిపాదనలకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. 12, 28 శాతం శ్లాబులను తొలగించి.. 5, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉంచేందుకు మంత్రుల బృందం అంగీకారం తెలిపారని బిహార్ డిప్యూటీ సీఎం, రేటు హేతుబద్ధీకరణకు సంబంధించి జీవోఎం కన్వీనర్ సామ్రాట్ చౌధరి తెలిపారు.
జీఎస్టీకి సంబంధించి కేంద్రం చేసిన 2 ప్రతిపాదనలకూ జీవోఎం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రతిపాదనలో అల్ట్రా లగ్జరీ, సిన్ గూడ్స్ పై 40 శాతం పన్ను విధించడం కూడా ఉందని యూపీ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు. కార్లు, సిన్ గూడ్స్ వంటి అల్ట్రా లగ్జరీ వస్తువులపై ప్రస్తుత పన్ను రేటు కొనసాగించేందుకు తమ రాష్ట్రం 40 శాతం జీఎస్టీ రేటుపై లెవీని ప్రతిపాదించిందని పశ్చిమ బెంగాల్ ఆర్ధిక మంత్రి చంద్రిమా భట్టాచార్య తెలిపారు. ఈ కొత్త జీఎస్టీ శ్లాబ్ లు అమలు తర్వాత కేంద్రం, రాష్ట్రాలకు కలిగే ఆదాయ నష్టం గురించి కేంద్రం చేసిన ప్రతిపాదనల్లో ప్రస్తావించలేదని ఆమె పేర్కొన్నారు.
రేట్ల హేతుబద్ధీకరణకు సంబంధించి సామ్రాట్ చౌధరి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మంత్రుల బృందం గురువారం భేటీ అయ్యింది. ప్రస్తుతం 4 శ్లాబులు ( 5,12,18,28 శాతం) ఉండగా.. 2 శ్లాబులు మాత్రమే (5,18) ఉంచేందుకు మంత్రుల బృందం అంగీకరించింది. దీంతో పాటు హానికర ఉత్పత్తులకు 40 శాతం జీఎస్టీ విధించేందుకు ఆమోదం తెలిపింది. జీఎస్టీ కౌన్సిల్ లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.