
సినీ నటుడు, బిగ్‌బాస్ -5 సభ్యుడు లోబో కు ఏడాది జైలు శిక్ష పడింది. లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే 2018లో ఓ వీడియో షూటింగ్ లో భాగంగా రామప్ప, లక్నవరం భద్రకాళి చెరువు ప్రాంతంలో లోబో తన బృందంతో పర్యటించారు. అదే సంవత్సరం మే 21న వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం వద్ద లోబో కారుతో ఆటోను ఢీ కొట్టాడు. దీంతో ఆటోలోని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాలైయ్యాయి. కాగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు విచారించిన జనగామ కోర్టు లోబోకు ఏడాది జైలు శిక్ష, రూ.12,500 జరిమానా విధించింది.