నెల్లూరు వీఆర్‌ హైస్కూలుకు పునర్‌వైభవం!

నెల్లూరుః ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిజిటల్‌ విద్యకు శ్రీకారం చుట్టింది. నెల్లూరులోని వీఆర్సీ మోడల్ పాఠశాలను అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్ది పునర్‌వైభవం కల్పించారు. ఈ పాఠశాలను రాష్ట్ర ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్‌ సోమవారం నాడు ప్రారంభించారు. పాఠశాలలోని తరగతి గదులను లోకేశ్‌ సందర్శించి.. డిజిటల్ విద్యావిధానం అమలుతీరును పరిశీలించారు. తరగతి గదుల లోపలకి వెళ్లి.. విద్యార్థులతో లోకేశ్‌ కొద్దిసేపు ముచ్చటించారు.

అనంతరం లైబ్రరీలో అందుబాటులో ఉన్న పుస్తకాలను పరిశీలించారు.  ఈ సందర్భంగా పీ4 కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ముందుకు వచ్చిన పొంగూరు శరణిని లోకేశ్‌ అభినందించి సత్కరించారు. పీ4లో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డిలను లోకేశ్‌ అభినందించారు.

గత ప్రభుత్వ పాలకుల నిర్వాకంతో ఐదేళ్లుగా మూతబడిన వీఆర్‌ హైస్కూల్‌ పునః ప్రారంభం ఘనంగా జరిగింది.  1875లో నగరం నడిబొడ్డున 12 ఎకరాల్లో ఏర్పాటైంది. నెల్లూరు జిల్లాతోపాటు పొరుగు జిల్లాల విద్యార్థులకు సైతం ఇక్కడ విద్యను అభ్యసించేవారు. వీఆర్‌ హైస్కూల్‌ను సోమవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించడంతో పాత విద్యార్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడే చదువుకుని రాష్ట్ర పురపాలక శాఖామంత్రిగా ఉన్న నారాయణ చొరవ తీసుకుని పాఠశాలకు రూ.15 కోట్లతో అత్యాధునిక మౌలిక వసతులు కల్పించారు. అంతేకాదు నిరుపేద విద్యార్థులు 1050 మందిని చేర్చుకునేలా చేశారు. ఇక్కడ అంతర్జాతీయ విద్యావిధానాలతో కూడిన ఉచిత విద్య అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇక్కడ విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. సైకిళ్లు, భోజనం, స్నాక్స్, ఉచిత పుస్తకాలు, దుస్తులు అందించారు. అనంతరం మంత్రి లోకేశ్‌ క్రీడా మైదానాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులతో లోకేశ్‌ క్రికెట్, వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు.  ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వంలో అందరికి అందుబాటులో విద్య, వైద్యం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని పేర్కొన్నారు. విద్యను నిరుపేదలకు చేరువచేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని లోకేశ్‌ అన్నారు. నెల్లూరు నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మున్సిపల్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసినట్టు మంత్రి చెప్పారు.