ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు

ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ సస్పెన్షన్ గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని అరాచకాలు చేసిన సునీల్ కుమార్‌పై అభియోగాలు నిరూపణ కావడంతో గతంలో సస్పెన్షన్ వేటు వేసింది. మరో రెండు రోజుల్లో సస్పెన్షన్ గడువు ముగియనుండటంతో రివ్యూ కమిటీ దీనిపై సమీక్షించింది. గతంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు పలుమార్లు వెళ్లినట్లు గుర్తించింది. అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో సునీల్‌కుమార్‌పై విచారణ కొనసాగుతోంది.

అప్పటి ఎంపీ, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును వేధించిన కేసులోనూ సునీల్ కుమార్‌పై విచారణ జరుగుతోంది. సునీల్‌ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తే సాక్ష్యాధారాలు, దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని రివ్యూ కమిటీ నివేదించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున సస్పెన్షన్‌ను పొడిగించాలని సిఫారసు చేసింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకు సునీల్‌ కుమార్‌పై సస్పెన్షన్ పొడిగిస్తూ ఏపీ సీఎస్ కె. విజయానంద్ ఆదేశాలు జారీచేశారు.