స్వర్ణాంధ్ర కావాలంటే ప్రజల్లో మార్పు రావాలి -చంద్రబాబు

పెద్దాపురం: స్వర్ణాంధ్ర కావాలంటే ప్రజల ఆలోచనా విధానం మారాలని సీఎం చంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అంటు వ్యాధులు రావడానికి ప్రధాన కారణం చెత్త, అపరిశుభ్రత. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై కూడా పన్ను వేసింది. కానీ చెత్త మాత్రం తొలగించలేదు. వైసీపీ ప్రజారోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన అన్నారు.

అక్టోబర్ 2 నాటికి అన్ని మున్సిపాలిటీల్లో చెత్తాచెదారం తొలిగిస్తాం. గత ప్రభుత్వంలో అరాచకాన్ని సృష్టించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగి ఆరోగ్యంగా ఉండాలనేది నా కోరిక. మన ఆలోచనలు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఏదీ వృథా కాదు.. చెత్త నుంచి కూడా సంపద సృష్టించొచ్చు. ఈ-వేస్ట్ ను రీసైక్లింగ్‌కు పంపేలా ఆలోచనలు చేస్తున్నాం. పేదవాడి ఆరోగ్యం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

సంపద సృష్టించడం.. ఆదాయాన్ని పెంచడం మాకు తెలుసు. నేను సూపర్ సిక్స్ అంటే సాధ్యం కాదన్నారు. చేసి చూపించాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అని ఆయన అన్నారు. వైకుంఠపాళి ఆటలు మన రాష్ట్రానికి వద్దు. మనకు అభివృద్ధి కావాలి. పేదరికం పోవాలి. మీ రాష్ట్రంలో భూతం ఉంది.. మళ్లీ రాదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. వదల బొమ్మాళీ అంటున్న వైసీపీ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది సీఎం అన్నారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం కూడా వైసీపీకి దక్కలేదు. అందుకే బయట విషం చిమ్ముతున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమరావతి మునిగిపోయిందని దుష్ర్పచారం చేస్తున్నారు. అమరావతికి నిధులు ఇవ్వొద్దని అందరికీ లేఖలు రాశారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా అమరావతిని తయారు చేస్తాం. అమరావతి, విశాఖ, తిరుపతిని మహానగరాలు మారుస్తాం అని చంద్రబాబు అన్నారు.