కుంభకర్ణుడికి పోటీ..  నిద్రతోనే కొట్టేసింది 9 లక్షలు!

ఉద్యోగం కోసం ఎంతో మంది రాత్రింబగళ్లు కష్టపడతారు. కానీ, ఈ అమ్మాయి మాత్రం పడుకుని లక్షలు కొట్టేసింది..! అవును, మీరు విన్నది నిజమే. రాత్రికి తొమ్మిది గంటలు నిద్రపోయినందుకు ఏకంగా 9 లక్షల రూపాయలు గెలుచుకుంది ఈ కుంభకర్ణి..! ఇంతకీ ఈమె ఎవరు? ఏం చేసింది? తెలుసుకుందాం పదండి!

అది పూణే నగరం. అక్కడ పూజా మాధవ్ వవాల్ అనే ఒక అమ్మాయి UPSC పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. రోజూ పుస్తకాలతో కుస్తీ పడుతూ, కష్టపడి చదువుతోంది. కానీ, ఒకరోజు ఈ అమ్మాయి కలలో కూడా ఊహించని ఒక ఆఫర్ తలుపు తట్టింది. అదేంటంటే… నిద్రపోతే  డబ్బులు ఇస్తారట!

వేక్‌ఫిట్ అనే ఒక కంపెనీ “నిద్రపోండి.. డబ్బులు గెలవండి” అనే ఒక విచిత్రమైన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం పెట్టింది. రాత్రికి కనీసం 9 గంటలు నిద్రపోతే చాలు, లక్ష రూపాయలు ఇస్తారట..! లక్షల మంది దీనికి దరఖాస్తు చేసుకున్నారు. మన పూజా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

అలా మొదలైన ఈ 60 రోజుల నిద్ర యజ్ఞంలో పూజా మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. ప్రతి రోజూ కరెక్ట్‌గా 9 గంటలు కునుకు తీసింది. వాళ్లు ఇచ్చిన స్లీప్ ట్రాకర్‌తో ఆమె నిద్ర క్వాలిటీని కూడా గమనించారు. ఏదో తిన్నంగా పడుకుంటే సరిపోదు, మంచిగా నిద్రపోవాలి కూడా!

లక్షకు పైగా అప్లికేషన్లు వస్తే, కేవలం 15 మందిని మాత్రమే ఈ నిద్రపోయ్యే జాబ్ కోసం ఎంపిక చేశారు. అందులో మన పూజా కూడా ఒకరు. ఇక అంతే… రెండు నెలల పాటు నిద్ర.. నిద్ర.. నిద్ర! మధ్యలో మెలకువ వస్తే మళ్లీ నిద్ర!

చివరికి రిజల్ట్స్ వచ్చాయి. అందరికంటే ఎక్కువ సేపు, మంచిగా నిద్రపోయినందుకు మన పూజా వవాల్ ‘స్లీప్ ఛాంపియన్ ఆఫ్ ద ఇయర్’ అయిపోయింది! ఆమెకు లక్ష రూపాయలు బేసిక్ శాలరీతో పాటు, అదనంగా మరో 8.1 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ వచ్చింది. మొత్తం కలిపితే అక్షరాలా 9.1 లక్షల రూపాయలు!

చూశారా.. కష్టపడి చదివితేనే కాదు, బాగా నిద్రపోయినా కూడా డబ్బులు వస్తాయి అనమాట..! UPSC ప్రిపేర్ అయ్యే ఈ అమ్మాయి, ఇప్పుడు నిద్రతోనే లక్షలు కొట్టేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది.

ఈ వేక్‌ఫిట్ వాళ్ల ఆలోచన మాత్రం మామూలుగా లేదు కదా? దేశంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారని, నిద్ర  ప్రాముఖ్యతను తెలియజేయడానికి వాళ్లు ఇలాంటి వినూత్నమైన ప్రోగ్రాం పెట్టారు. ఏదైతేనేం, మన పూజా మాత్రం పడుకుని పండగ చేసుకుంటోంది!

నిద్ర కూడా ఇంత డబ్బు తెచ్చి పెడుతుందా అని ఆశ్చర్యపోతున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా బాగా నిద్రపోండి, అదృష్టం కలిసి వస్తే లక్షలు మీ సొంతం కూడా కావచ్చు! ఇది విన్న తర్వాత కొందరికి నిద్ర పట్టకపోవచ్చు కూడా! మరో సరదా వార్తతో మళ్లీ కలుద్దాం..!