
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా పరిధిలో గర్భిణి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. డీఆర్ఎఫ్ బృందాలు మేడిపల్లి ప్రతాఫ్ సింగారం మూసీ వద్దకు చేరుకున్నాయి. నిన్న (ఆదివారం ) రాత్రి వరకు స్వాతి శరీర భాగాల కోసం పోలీసులు, డీఆర్ బృందాలు గాలించాయి.
సోమవారం మరోసారి బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మూసీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో శరీర భాగాలు చాలా దూరం కొట్టుకుపోయి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం 10 కిలోమీటర్ల దూరం వరకు డీఆర్ఎఫ్ బృందాలు గాలించాయి.
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీహిల్స్ లో గర్భవతైన తన భార్యను చంపిన మహేందర్.. మృతదేహాన్ని ముక్క ముక్కలుగా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం శరీరభాగాలను కవర్లో ప్యాక్ చేసి.. బయటకు తీసుకెళ్లి పడేశాడు. విచారణలో స్వాతి కాళ్లు, చేతులు, తల వేరు చేసి మూసీలో వేసినట్లు మహేందర్ రెడ్డి చెప్పడంతో వాటి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.