ధర్మస్థల ఘటనలో ట్విస్ట్.. ముసుగు వ్యక్తి అరెస్ట్

బెంగళూరు: కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వందల మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని ప్రకటించిన పారిశుద్ద్య కార్మికుడు, ముసుగు వ్యక్తి భీమాను సిట్ అధికారులు అరెస్టు చేశారు. అతడు అబద్ధాలు చెప్పి, ప్రజలను తప్పుదోవ పట్టించారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికుడు మాట మార్చాడు.

ధర్మస్థల పరిసరాల్లో తాను పూడ్చిపెట్టానని చెప్పిన 100కు పైగా శవాల ఆనవాళ్లను చూపకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించాడనే అభియోగాలపై భీమాను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సిట్ ప్రధాన అధికారి ప్రణబ్ మొహంతీ అతడిని విచారించారు. మాయమాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని చేతులు ఎత్తేశాడని ఈ దర్యాప్తులో విచారణ బృందం గుర్తించింది. దీంతో ఆ ముసుగు వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు నేడు కోర్టులో హాజరుపర్చనున్నారు.