వేములవాడలో ఆది శ్రీనివాస్‌కి ఎన్ని మార్కులు? | Logutt

ఆధ్యాత్మిక కేంద్రంగా, తెలంగాణ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ప్రాంతంగా వేములవాడకో ప్రత్యేక చరిత్ర ఉంది. రాజన్న ఆశీస్సులున్న ఈ గడ్డపై గతంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా దాదాపుగా అగ్రకులాలవారే. 2023 ఎన్నికల్లో ఈ సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. తొలిసారి బీసీ నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ విప్‌గా, సీఎంకి సన్నిహితుడిగా దూసుకుపోతున్న ఆ ఎమ్మెల్యే పాలనపై ఇప్పుడు నియోజకవర్గంలో మిక్స్‌డ్‌ టాక్‌ నడుస్తోంది. అంతా బావుంటే ఎందుకిలాంటి చర్చ జరుగుతోంది?


ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచాక వేములవాడ పట్టణం కొత్త కళను సంతరించుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దాదాపు 150 కోట్లతో ఆలయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన రహదారుల విస్తరణ కూడా వేగవంతమైంది. వేములవాడ పట్టణాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఆది శ్రీనివాస్ చేస్తున్న కృషిని మెజార్టీ ప్రజలు స్వాగతిస్తున్నారు. అయితే రాజన్న క్షేత్రంపై వేములవాడ ఎమ్మెల్యే ఎంత శ్రద్ధ పెట్టారో, నియోజకవర్గంలోని మారుమూల మండలాలైన కోనరావుపేట, కథలాపూర్, మేడిపల్లిని అంత నిర్లక్ష్యం చేశారనే విమర్శలు బలంగా ఉన్నాయి.


ఎన్నికల సమయంలో ఇచ్చిన రహదారుల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, బ్రిడ్జిల నిర్మాణ హామీలు ఇప్పటికీ నెరవేరలేదని ఆయా మండలాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధిపైనే పూర్తిగా దృష్టి పెట్టడం వల్ల, మౌలిక వసతులు, స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు, ప్రజలు విమర్శిస్తున్నారు. మంత్రి పదవిపై ఆశతో ఎమ్మెల్యే హైదరాబాద్, జిల్లా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారని, స్థానిక సంస్థల అభివృద్ధిని విస్మరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైపు ఆలయ విస్తరణ పనులతో వేములవాడ పట్టణం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రణాళికాపరమైన లోపాలు పర్యాటకులను, స్థానికులను ఇబ్బంది పెడుతున్నాయి.


వేములవాడ పట్టణంలో మురుగునీటి పారుదల వ్యవస్థ పూర్తిగా శిథిలమైంది. ప్రధాన వీధుల్లో, నివాస ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. ఇరుకు రోడ్లు, అస్తవ్యస్త పార్కింగ్‌తో వాహనాల రద్దీ ఏర్పడుతోంది. ముఖ్యంగా పండుగ సమయాల్లో భక్తులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుంటున్నారు. ఆలయ చుట్టూ పార్కింగ్ కోసం సరైన ప్రదేశాలు ఏర్పాటు చేయకపోవడం ప్రధాన లోపంగా ఉంది. మరోవైపు ఆలయ విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం, పునరావాసం విషయంలో ఇంకా పూర్తి న్యాయం జరగలేదు. న్యాయమైన పరిహారం అందడం లేదని, పునరావాస కేంద్రాల విషయంలో జాప్యం జరుగుతోందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యల విషయంలో కొన్ని అసంతృప్తులున్నా ఆది శ్రీనివాస్ నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. ప్రభుత్వ విప్‌గా, స్థానిక ఎమ్మెల్యేగా బిజీ షెడ్యూల్‌ ఉన్నా.. ప్రజల శుభాకార్యాలు, కష్టసుఖాల్లో కలుస్తూ వారితో ప్రత్యేక బంధాన్ని ఏర్పరుచుకున్నారు. ఏ సమస్య ఉన్నా ప్రజలు ఆయన్ను నేరుగా కలిసేందుకు అవకాశం ఉంది. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు తన క్యాంప్ ఆఫీసులో అందుబాటులో ఉంటారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే బీసీ నేతగా ఆయన తన పట్టును నిరూపించుకున్నారు. కేబినెట్‌ విస్తరణ జరిగితే పదవి దక్కుతుందన్న ఆశతో ఇటు ప్రతిపక్షాలపై విరుచుకు పడుతూ, ప్రభుత్వంపై వచ్చే విమర్శలను తిప్పికొట్టటంలో ముందుంటున్నారనే అభిప్రాయంతో నియోజకవర్గ ప్రజలున్నారు.


వేములవాడ రాజన్న క్షేత్రం అభివృద్ధి ఎంత ముఖ్యమో, మారుమూల మండలాలకు, పట్టణంలోని ప్రధాన సమస్యలకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు. ఆ సమస్యలు తీరిస్తే ఎమ్మెల్యేగా ఆయన్ని ఎవరూ వేలెత్తిచూపే అవకాశం ఉండదంటోంది పార్టీకేడర్‌ కూడా. అధికార పార్టీకి బలమైన కేడర్‌ ఉంటే.. విపక్షాలైన బీఆర్‌ఎస్‌, బీజేపీ స్తబ్దుగా ఉండటం ఆది శ్రీనివాస్‌కు కలిసొచ్చే అంశం. అయితే, మారుమూల మండలాల అభివృద్ధిపై, పట్టణ సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి కేంద్రీకరిస్తేనే, తొలి బీసీ ఎమ్మెల్యేగా ఆయన సృష్టించిన సంచలనానికి సార్ధకత లభిస్తుంది. లేదంటే కొన్నివర్గాల్లో ఉన్న అసంతృప్తి పెరిగితే అదే చివరికి మైనస్‌గా మారుతుంది.