రఘురామకృష్ణంరాజు దెబ్బకు శివ అడ్రస్ గల్లంతయినట్లేనా? | Loguttu

టీడీపీ కంచుకోటలో ఆ మాజీ ఎమ్మెల్యే అధ్యాయం ముగిసినట్లేనా? ఎన్నికల్లో ట్రిపులార్‌తో తలపడ్డ ఆయన అడ్రస్ గల్లంతయిందా? గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉంటానన్న ఆయన మాట ఏమైంది? వైఎస్‌ వేవ్‌లోనూ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆ రాజుగారు.. సింహాన్ని నమ్ముకుని బరిలోకి దిగి ఇప్పుడు పిల్లిలా మారాల్సి వచ్చిందా? పెద్దరాజుగారి దెబ్బతో రాజకీయంగా గల్లంతైన ఆ నాయకుడెవరు? ఆయన అనుచరగణానికి దిక్కెవరు?


పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచీ పదిసార్లు ఎన్నికలుజరిగితే తొమ్మిదిసార్లు అక్కడ టీడీపీదే గెలుపు. 2004లో వైఎస్‌ పాదయాత్రతో ఉండిలో కాంగ్రెస్‌ గెలిచింది. 2009లో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకొచ్చినా.. ఉండిలో మాత్రం టీడీపీ తన స్థానాన్నితిరిగి దక్కించుకుంది. 2009లో ఉండి ఎమ్మెల్యేగా తొలిసారి
గెలిచిన శివరామరాజు అలియాస్ కలువపూడి శివ అడ్రస్ మాత్రం ఇప్పుడు గల్లంతయిందట. 2009తర్వాత రాష్ట్ర విభజన జరిగి, 2014
ఎన్నికల్లో కూడా రెండోసారి ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన శివ అప్పట్లో కూటమి ప్రభుత్వంలో మంత్రిపదవి కూడా వస్తుందని ఆశించి
భంగపడ్డారు. 2019లో పార్టీలో సర్దుబాట్లతో తన సోదర సమానుడు అంటూ ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజుకోసం ఉండి సీటు త్యాగం చేశారు. నరసాపురం టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు శివ.


2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో నరసాపురంలో శివకు ప్రత్యర్థులుగా వైసీపీ నుంచి రఘురామకృష్ణంరాజు, జనసేన నుంచి కొణిదల నాగబాబు పోటీచేశారు. అప్పట్లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు.. ఇప్పుడు అధికారపార్టీలో చేరి కలువపూడి శివ రాజకీయ భవిష్యత్ ముగియడానికి పరోక్షంగా కారకుడయ్యారు. 2024 ఎన్నికల్లో ఉండి సీటు తనకేననుకున్నారు శివరామరాజు. కానీ రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరటంతో లెక్కలు మారిపోయాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును కూడా పక్కనపెట్టి రఘురామకు టికెట్‌ కేటాయించింది టీడీపీ అధిష్ఠానం. అధిష్ఠానం హామీతో మంతెన సైలెంట్‌ అయితే.. కలువపూడి శివమాత్రం తిరుగుబాటు చేశారు. సింహం సింబల్‌పై ఇండిపెండెంట్‌గా పోటీచేసిన శివరామరాజు ఓటమి తర్వాత ఎక్కడున్నారో, ఏడనున్నారో అంటూ అందరూ చతుర్లాడుతున్నారట.


అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ధిక్కరించిన శివరామరాజుపై టీడీపీ అధిష్ఠానం వేటు వేసింది. దీంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాక రాజకీయంగా ఉనికిలో లేకుండా పోయారు శివ. ఎన్నికల ప్రచారంలో సింహంలా గర్జించిన శివరామరాజు..
రఘురామకృష్ణంరాజు ముందు చిట్టెలుకలా మారిపోయారని అంతా సెటైర్లు వేస్తున్నారట. వాస్తవానికి 2019 ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ గా పోటీచేసి ఓటమి తర్వాత కొన్నాళ్లు కనబడకుండా పోయిన శివ, ఆ తర్వాత మళ్లీ 2024 ఎన్నికలొచ్చేసరికి తన సేవా ట్రస్ట్ కార్యక్రమాల్లో స్పీడ్‌ పెంచారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఊరూరా తన దాతృత్వాన్ని చాటుకున్న శివరామరాజు, ఎన్నికలు ముగిశాక అయిపులేకుండా పోయారు. ఉండి నియోజకవర్గంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన శివ తనకంటూ
కొంత కేడర్‌ని ఏర్పాటుచేసుకున్నారు. మాజీ మంత్రి అబ్బాయిరాజు శిష్యుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన కలువపూడి శివ తనకున్న చరిష్మాను, కేడర్‌లో ఉన్న నమ్మకాన్ని మాత్రం శివ నిలబెట్టలేకపోయారని విమర్శిస్తున్నారట కొందరు.


ఎమ్మెల్యేగా ఐదేళ్లపాటు రాజశేఖరరెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ, ప్రతిపక్ష పాత్రపోషించడంలోనూ పార్టీలో ఒకప్పుడు చెరగని ముద్రవేసుకున్నారు శివరామరాజు. నిరసనలు, పోరాటాలతో నిత్యం
ప్రజల్లో ఉంటూ 2014 ఎన్నికల్లోనూ ఆ చరిష్మాతోనే సీటు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికలు వచ్చేసరికీ చేసిన తప్పులే ఆయనకు మైనస్‌ అయ్యాయి. సీటిస్తే గెలుపు కష్టమంటూ ఫీడ్‌బ్యాక్‌ రావటంతో 2019లో అధిష్ఠానం ఆయన్ని ఉండినుంచి తప్పించి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా దించింది. శివ రాజకీయ జీవితం ముగిసేందుకే అదే మొదటి దశగా విశ్లేషకులు చెబుతున్నారట. అయినా, ఐదేళ్లపాటు అవకాశం కోసం ఎదురుచూసి భంగపడ్డ శివ, కనీసం సేవా కార్యక్రమాలోతోనైనా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన తన వ్యక్తిగత వ్యవహారాల్లో మునిగిపోగా, ఆయన్ను నమ్ముకున్న కేడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందట.


శివరామరాజును నమ్ముకున్న అనుచరగణంలో కొందరు 2019 ఎన్నికల్లో గెలిచిన మంతెన రామరాజు వైపు వెళ్లిపోయారు. మరికొందరు 2024 ఎన్నికల్లో తమ నాయకుడు వస్తాడు, సీటు తెచ్చుకుంటాడన్న నమ్మకంతో అలాగే ఉండిపోయారు. కొందరైతే సవాళ్లు విసిరి, బెట్టింగ్ లు కాసిమరీ నష్టపోయారు. పార్టీతో తిరుగుబాటుచేసి శివ ఓడిపోవటంతో.. ఆయన్ని నమ్ముకున్నవారికి ఇప్పుడు దిక్కుతోచడం లేదట. ఇన్నేళ్లూ శివ వెనుక ఉన్నవారిలో ఇప్పటికే సగం మంది జారిపోగా, మరికొందరు నయానో, భయానో సైడ్ అయిపోయారట. ఇక ప్రత్యక్షంగా శివకోసం పోరాడిన వారు అటు రామరాజు వర్గంవైపు వెళ్లలేక, ఇటు డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టిన రఘుకృష్ణంరాజువైపు నిలవలేక రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోయారట. మీ నాయకుడు ఎక్కడనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నలిగిపోతున్నారు. రఘురామ దెబ్బకు నియోజవర్గంలో ఎన్ని వర్గాలున్నా, అవన్నీ ఆయనకు అనుకూలమేనని.. విపక్షమే నోరుమెదపలేని పరిస్థితుల్లో ఇక శివ ఏం కనబడతారని అంతా చర్చించుకుంటున్నారట.

మొత్తానికి పదవులు ఉన్నంతకాలం ప్రజల్లో ఉండి, ఆ తర్వాత సొంత పనుల్లో బిజీ అయితే, ప్రజలనుంచి వచ్చే వ్యతిరేకత
ఏంటనేది గత ఎన్నికల్లో గట్టిగానే చవిచూసిన కలువపూడి శివ, ఇప్పటికీ అడ్రస్ లేకపోవడంతో, ఇక రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేననీ
కొందరంటున్నారు. ప్రజల్లో ఉంటానన్న శివరామరాజు మళ్లీ వాళ్ల నమ్మకంకోసం ఏం చేయబోతున్నారు? ఆయన రీ ఎంట్రీ ఎప్పుడుంటుంది? గత ఎన్నికల్లోనే వైసీపీలోకి వెళ్తారంటూ జరిగిన ప్రచారమే నిజమయ్యేలా ఉందా? జగమొండి నేతలున్న ఉండి రాజకీయాల్లో చివరికి ఏం జరగబోతోందో చూడాలి మరి.