బీహార్ ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేతలు ఫుల్‌ ఖుషీ

బీహార్ ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేతలు ఫుల్‌ ఖుషీ. ఎన్డీఏ గెలిచినందుకో.. మహాఘట్ బంధన్ ఓడినందుకో కాదు. జన్ సురాజ్ పార్టీ ఘోర ఓటమి వైసీపీ క్యాడర్ కళ్ళల్లో ఆనందం నింపుతోందట. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఒకనాటి వైసీపీ ఎన్నికల వ్యూహకర్త. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని గట్టిగా ప్రచారం చేసింది కూడా ఆయనే. అందుకే ఆ మాజీ ఎన్నికల వ్యూహకర్త పార్టీ ఓటమిని వైసీపీ కేడర్‌ సోషల్ మీడియా వేదికగా సెలబ్రేట్‌ చేసుకుంటోంది.

బీహార్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరుపున ఏపీ మంత్రి నారా లోకేష్ విస్తృతంగా ప్రచారం చేశారు. గతంలో సీఎం చంద్రబాబు కూడా ఎన్డీఏ తరపున అనేక రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భాలున్నాయి. ఇప్పుడా పాత్రను నారా లోకేష్ పోషిస్తున్నారు. అందుకే బీహార్ ఫలితాలు టీడీపీ నేతల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సేమ్‌టైమ్‌ అటు వైసీపీ క్యాడర్ కూడా బీహార్ ఫలితాలను ఎంజాయ్ చేస్తోంది. కాకపోతే వారి ఆనందానికి కారణం వేరే. ఈ ఎన్నికల్లో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్‌ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడమే వారి ఆనందానికి కారణమ‌ట‌.


బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ 230కి పైగా స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఒక్క నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ అభ్యర్థి గెలవలేదు. సహజంగా ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ కూడా ఈ ఫలితాలను ఊహించి ఉండరు. అయితే ప్రశాంత్ కిషోర్ ఘోర ఓటమిని వైసీపీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటోందంటే ఏపీలో గత ఎన్నికల ముందు ఆయన వ్యవహరించిన తీరే కారణమ‌ని టాక్. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్‌రెడ్డి తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ని నియమించుకున్నారు. ఐ ప్యాక్ టీమ్ ద్వారా అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు పీకే. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు నచ్చడంతో జగన్మోహన్‌రెడ్డి కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. చివరికి పార్టీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కూడా ప్రశాంత్ కిషోర్ కి అప్పగించారు జగన్. ఆ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది.

2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు క్రెడిట్ అంతా ప్రశాంత్ కిషోర్ దే అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తు నాణేనికి రెండోవైపు స్టోరీ మరోలా ఉంది. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు తీసుకోక ముందే వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అప్పటి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేశారు. అదే సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం విషయం లో కూటమి ప్రభుత్వ వైఖరిపై ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. వీటన్నిటికీ తోడు జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఇక రాజకీయంగా 2019 ఎన్నికల నాటికి బీజేపీ, జనసేన టీడీపీకి దూరమయ్యాయి. ఇలా అన్ని అంశాలు కలిసొచ్చి వైసీపీని అధికారం లోకి తీసుకొచ్చాయి. కానీ వైసీపీ క్రెడిట్ మొత్తం ప్రశాంత్ కిషోర్ కొట్టేశారనేది వైసీపీ నేతల్లోని మెజార్టీ వాదన. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంతో అలాంటి అంశాలన్నీ పక్కకెళ్లిపోయాయి. అధికారంలోకొచ్చాం అంతేచాలని సంబరపడ్డారు.

అదే ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికల నాటికి వైసీపీకి దూరమయ్యారు. జగన్మోహన్‌రెడ్డికి ఐప్యాక్ రాజకీయ వ్యూహాలు అందించినా, ప్రశాంత్ కిషార్ మాత్రం ఐ ప్యాక్ నుంచి తప్పుకున్నారు. అంతవరకే అయితే వైసీపీ నేతలకు కూడా ఆయన పై కోపం ఉండేది కాదేమో. కానీ ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, వైసీపీ ప్రభుత్వ విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ తరువాత నుంచి ఏపీలో వైసీపీ ఓడిపోతుందంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ వైసీపీపై నెగిటివ్ ప్రచారం చేశారు ప్రశాంత్ కిషోర్. ఈ ప్రచారాన్ని నాటి ప్రతిపక్ష పార్టీలు బలంగా వాడుకున్నాయి. వైసీపీ విజయం కోసం పని చేసిన పీకేలాంటి వాళ్లు కూడా ఆ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రజలను ఆలోచనలో పడేసింది. దీనికి తోడు రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలన్నీ కూటమికి కలిసొచ్చి వైసీపీని పదకొండు సీట్లకి పరిమితం చేసింది.


ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం పై ఆ పార్టీ నేతలు,క్యాడర్ కూడా అప్పట్లో ఆయనకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని వైసీపీపై తప్పుడు ప్రచారం చేశారని గతంలోనే ఆ పార్టీ నేతలు ఎదురు దాడికి దిగారు. అయినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ప్రశాంత్ కిషోర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వైసీపీ నేతలు,క్యాడర్‌కి ఇప్పుటు ఆయన జుట్టు చేతికి దొరికింది. బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒక్క సీటు గెలవలేదు. దీంతో ఆయనపై ఎప్పటి నుంచో వైసీపీ క్యాడర్ లో ఉన్న ఆక్రోశం కాస్త సంతోషంగా మారింది. పీకేకి తగిన శాస్తి జరిగిందంటూ సంబర పడుతున్నార‌ట‌. ప్రశాంత్ కిషోర్ వల్లే నిజంగా 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే ఆయన తన సొంత పార్టీని ఎందుకు గెలిపించుకోలేక పోయారని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఆయన అద్భుతమైన వ్యూహాలు సొంత రాష్ట్రంలో పని చేయలేదా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. తమ రెక్కల కష్టాన్ని గతంలో ప్రశాంత్ కిషోర్ సొమ్ము చేసుకున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు.