ప్రపంచం మరోసారి అణ్వాయుధ పోటీ గురించి చర్చ

ప్రపంచం మరోసారి అణ్యాయుధ పోటీ గురించిన చర్చను చూడక తప్పడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న యుధ్దాలు, అగ్రరాజ్యాల ఆధిపత్యం ఇవన్నీ ఇందుకు కారణంగా మారుతున్నాయి. దేశాల మధ్య యుధ్దం ఏదో ఒక రోజు అణ్యాయుధాల వాడకం వరకు వెళుతుందని పరిశీలకులు ఎప్పుడో వార్నింగ్ ఇచ్చేసారు. ఆ దశ మళ్లీ ప్రపంచం ముందుకు వచ్చేసిందని చెబుతున్నారు విశ్లేషకులు. ఒక రకంగా ఇది మరో ప్రపంచయుద్ధానికి నాంది అని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అందరూ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. పాకిస్తాన్, ఉత్తర కొరియాలు సైతం ఈ కార్యక్రమాలు చేపడుతుంటే మాకేం వచ్చిందని ప్రశ్నించారు. అందుకే అణ్వాయుధాల పరీక్షలను తక్షణం పునరుద్ధరించవలసిందిగా రక్షణ శాఖను ఆదేశించారు. ఇది ప్రపంచ అణు సుస్థిరత, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక నియమావళులపై అక్షరాలా బాంబు వేయడమే అంటున్నారు విశ్లేషకులు. అమెరికా 1992 సెప్టెంబర్ తర్వాత, పూర్తి విస్ఫోటనాత్మక అణు పరీక్షను నిర్వహించలేదు. అయితే, 1998లో భారత్ అణు పరీక్షలను జరిపితే, ఆ వెంటనే పాకిస్తాన్ కూడా నిర్వహించింది. ఒక అణ్వాయుధాన్ని విస్ఫోటనం చెందించి చూడటం కడసారిగా 2017లో జరిగింది. భూగర్భంలో ఉత్తర కొరియా ఆ పరీక్షను నిర్వహించింది. అప్పటి నుంచి, అణుపాటవ పరీక్షలపై మారటోరియం అమలులో ఉంది. ఇప్పటివరకు అది ఉల్లంఘనకు గురి కాలేదు. “చాలా ఏళ్ళ క్రితం మేం దాన్ని నిలుపు చేశాం. కానీ, ఇతరులు పరీక్షలు చేస్తూండటంతో, మేం కూడా చేయడం సముచితమని నాకనిపించింది” అని ట్రంప్ అన్నారు. రష్యా పేరును ట్రంప్ ప్రస్తావించకపోయినా ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ మాటలన్నారన్నది ఇక్కడ మనం గుర్తించాలి. ట్రంప్ అక్టోబరులో చేసిన ఈ ప్రకటనకు 10 రోజుల ముందు, మాస్కో అణ్వాయుధాలను మోసుకెళ్ళే సామర్థ్యం కలిగిన రెండు అధునాతన ప్రయోగ వ్యవస్థలను పరీక్షించింది. అక్టోబర్ 21న బురైవెస్నిక్ క్రూజ్ క్షిపణి.. అంటే ఆకాశం నుంచి జారిపడే అణుబాంబుని…, అక్టోబర్ 28న అసాధారణ పొసైడాన్ జలగర్భ టార్పెడోను… పరీక్షించింది. అయితే, ఈ రెండూ అణ్వాయుధాలను మోసుకెళ్ళగల వాహకాలు మాత్రమే. వాటిని పరీక్షించడం అణు విస్ఫోట పరీక్షలతో సమానం మాత్రం కాదు.

సాంకేతికంగా, అవి ప్రస్తుత ఆయుధ నియంత్రణ చట్రంలోకి కూడా రాజాలవు. ప్రయోగ వాహకాలను పరీక్షించాంగానీ, అణ్వాయుధాలను కాదని రష్యా స్పష్టం చేసింది. కానీ అణ్వాయుధాలను కూడా పొదువుకుంటే, బురైవెస్నిక్, పొసైడాన్ ప్రాణాంతక ఆయుధాలుగా పరిణమిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అవి రష్యా వద్ద ఉన్నంతవరకూ దాని జోలికి వెళ్ళే సాహసం ఎవరూ చేయలేరు. రాడార్ దృష్టిలో పడకుండా బురైవెస్నిక్ 15 గంటల్లో 14 వేల కిలోమీటర్ల దూరం పయనించినట్లు అక్టోబర్ 21 పరీక్షలో తేలింది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన చోట మాత్రమే అది భూవాతావరణంలోకి ప్రవేశించగలదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ క్షిపణి రక్షణ వ్యవస్థలు దాన్ని పసిగట్టలేవు. అదే అమెరికా ఆందోళనకు కారణం. ఇక పొసైడాన్… మానవ రహిత జలాంతర్గత అణ్వాయుధ వాహకం. ఇది 10వేల కిలోమీటర్ల దూరం వరకు ఆగకుండా పయనించగలదు. గరిష్ఠంగా గంటకు 185 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. నీటిలో వేయి మీటర్ల లోతు నుంచి సునాయాసంగా పని చేయగలదు. ఇది ఇప్పుడున్న జలాంతర్గామి నిరోధక వ్యవస్థలకు ఏమాత్రం అందనిదిగా నిపుణులు చెబుతున్నారు. అణ్వాయుధ వార్ హెడ్‌ను కూడా తగిలించుకున్న పొసైడాన్ను యుద్ధంలో ప్రయోగిస్తే, అది భూగర్భ శిలా ఫలకాలను కదిలించే విధంగా అణుధార్మిక సునామీని రేకెత్తించే భీకర సామర్థ్యం ఉంటుంది. ఇది భూగోళానికి, మానవాళికి ప్రళయం అంటే ఏమిటో చూపిస్తుంది. దీని సామర్థ్యం బీభత్సం వర్ణించడానికి మాటలు సరిపోవని చెబుతున్నారు నిపుణులు. 1972లో అమెరికా, ఒకప్పటి సోవియట్ యూనియన్లు బాలిస్టిక్ నిరోధక క్షిపణుల ఒడంబడికకు వచ్చాయి. పరస్పరం ఆయుధాలను ప్రయోగించుకుంటే ఇద్దరమూ నాశనం కావడం ఖాయం అనే అవగాహనను అది కల్పించింది. విధ్వంసాన్ని ఆధారం చేసుకున్న మనుగడ అనే ఆ సిద్ధాంతం అసంబద్ధమైనదిగా కనిపిస్తుంది. ఆనాటి పరిస్థితులను బట్టి కుదుర్చుకున్న ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చింది. ఎందుకంటే..2001 సెప్టెంబర్ 11 అంటే 9/11 నాటి పరిణామాల నేపథ్యంలో, అమెరికా 2002 జూన్లో, ఏకపక్షంగా ఆ ఒడంబడిక నుంచి ఉపసంహరించుకుంది. వైశాల్యం కుంచించుకుపోయి, ఆత్మ విశ్వాసం సన్నగిల్లిన పరిస్థితిలో ఉన్న రష్యాలో అది అభద్రత బీజాలను నాటింది. పొసైడాన్ 2015లో పురుడు పోసుకోవడం పుతిన్ కన్నుల్లో కాంతి రేఖను నింపింది. గడచిన దశాబ్దంలో అది అనేక రంగాలలో అనేక వైఫల్యాలను చూసింది.

సైంటిస్టులు ప్రమాదాల్లో చనిపోయారు. కానీ, ప్రయోగం మాత్రం నిరాటంకంగా కొనసాగి అక్టోబర్ 21న విజయవంతమైంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, చేసిన ప్రకటన బహుశా పుతిన్‌ను ఈ పరీక్షకు ఉరికొలిపి ఉండవచ్చునంటున్నారు నిపుణులు. ఇక్కడే మరో విషయం చెప్పుకోవాలి. ఇది బైడెన్ పాలనలో జరిగెద. ఉక్రెయిన్ రష్యా యుధ్దంలో అమెరికా ఉక్రెయిన్ వెంట ఉండి యుధ్దం జరిపించింది. అదే సమయంలో
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా సహా నాటో బలగాలను తన సొంత బలంగా భావించాడు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ అంతకన్నా జగమొండి అన్న విషయాన్ని విస్మరించాడు. దాంతో పుతిన్ ఏకంగా అణ్వాయుధాలను బయటకు తీస్తూ ప్రపంచయుధ్దానికి సన్నాహాలు చేయడం ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. ఇప్పటిదాకా అంతా మూడో ప్రపంచ యుధ్దం రాదంటే రాదని నమ్మకంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రష్యా అధ్యక్షుడు ఏమాత్రం తొందరపడకుండా ఓ పద్దతిగా తన క్యాబినెట్ ముందు సమస్యను వివరించి ఉక్రెయిన్‌తో పాటు ఉక్రెయిన్‌కు అండగా ఉన్న నాటో దేశాలపై కూడా ప్రతీకారం తీర్చుకునేందుకు ఏర్పాట్లు ప్రారంభించాడు. రష్యాపైకి ఉక్రెయిన్‌ దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించే విషయంలో అమెరికా అనుమతించిన మర్నాడే జెలెన్ స్కీ దాడులు జరపడంతో పుతిన్ మండిపడ్డారు. దాంతో అణు దాడుల నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఇది తమపై ఉక్రెయిన్‌-అమెరికా జరిపిన సంయుక్త దాడిగా పరిగణిస్తున్నాడు పుతిన్. వెంటనే రష్యా అణు విధానానికి సవరణలు జరపడంతో తను ఓ దారుణమైన నిర్ణయానికి వచ్చేసారని చెబుతున్నారు. దీంతో నాటో సభ్య దేశాలు హడలిపోయాయి. రష్యా అణు సామర్థ్యం మామూలుగా లేదు. ప్రపంచంలోనే రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగు పడి ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో అణు వార్‌హెడ్లున్న దేశం రష్యానే. 1994లో సోవియట్‌ నుంచి విడిపోయేనాటికి ఉక్రెయిన్‌ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలు పడి ఉండేవి. ఆ జాబితాలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశంగా ఉక్రెయిన్‌ ఉండేది. కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నింటినీ నాశనం చేసింది. అదీ కాకుండా ఇలా జరుగుతుందని తెలిసినా..ఉక్రెయిన్ సైతం అణు దాడి చేయించుకునేందుకే సిధ్దపడినట్టు కనిపిస్తోంది.

రష్యాని మరింత రెచ్చగొడుతోంది. కానీ రష్యా దగ్గర ఉన్నట్లుగా.. ఉక్రెయిన్ దగ్గర అణ్వాయుధాలు లేవు. అనుకున్నట్టు రష్యా అణుదాడికి పాల్పడితే.. అప్పుడు.. అమెరికా కూడా ఉక్రెయిన్‌కి అణ్వాయుధాలు ఇస్తుందా? అణు దాడికి ప్రతి దాడి చేయిస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు ట్రంప్ ‘అమెరికా రక్షణ గురించి సూపర్ ఐరన్ డోమ్ ఏర్పాటు’ గురించి సీరియస్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో జరగాల్సిన ఏర్పాట్ల ఉత్తర్వుపై 2025 జనవరి 27న ట్రంప్ సంతకం చేశారు. ఇప్పుడా డోమ్‌కు ‘గోల్డెన్ డోమ్’ అని పేరు పెట్టారు. అది అమెరికా ప్రధాన భూభాగానికి అంతటికీ గొడుగులా పనిచేస్తుందనీ, బహుశా 2045 నాటికి పూర్తి కాగల ఈ కార్యక్రమానికి దాదాపు 3.6 ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతాయనీ అంచనాలున్నాయి. ఇందుకు సంబంధించి ఎలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’కు మొదటి విడత చెల్లింపులు కూడా చేయడం జరిగిపోయింది. ఇది ఒకప్పటి అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ‘స్టార్ వార్స్’ కార్యక్రమాన్నీ, ప్రచ్ఛన్న యుద్ధం అంతాన్నీ గుర్తు చేస్తుంది. ఈ కార్యక్రమాలు దీర్ఘకాలంలో అమెరికా, రష్యా రెండింటినీ దివాళా తీయిస్తాయా? అంటే అవుననే చెబుతున్నారు విశ్లేషకులు. ఎందుకంటే బయటకు కనిపించినంత ఆర్థికపుష్టి లోపల లేదు. పైగా విపరీతమైన అప్పులు అగ్రరాజ్యాల మీద ఉన్నాయి. ఆర్థిక మాంద్యం ఎలాగూ లోలోపల దెబ్బతీస్తూనే ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తే బెటర్ అనే ప్రశ్నకు సమాధానం నిరాయధీకరణే అని వస్తోంది. పాకిస్తాన్‌తో సహా ఇతర దేశాలు రహస్యంగా అణు పాటవ పరీ క్షలు నిర్వహిస్తున్నాయని ట్రంప్ చెబుతున్నారు. అధునాతన అణ్వాయుధాలు డోమ్‌లో భాగం కావాలంటున్నారు. దానికి కొనసాగింపుగా, అమెరికా అణు పరీక్షలను పునరుద్ధరిస్తుందని అన్నారు. “సంయమనం, చర్చలు అవసరమైన సమయంలో అణు పాటవ పరీక్షలను పునరుద్ధరించాలనుకోవడం అస్థిరతకు దారి తీస్తుంది. మూడు దశాబ్దాలుగా అణ్వాయుధ పోటీని నిరోధిస్తూ వస్తున్న అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని బీటలు వారుతుంది. మరి ట్రంప్ అణు సంయమనాన్ని పాటిస్తారో, లేక పరీక్షల నిషేధ ‘రెడ్ లైన్’ను దాటేస్తారన్ని చూడాల్సి ఉంది. ఈ సమయంలో అంతర్జాతీయంగా అణు సంయమనం, నిరాయుధీకరణకు ఎప్పుడూ పోరాడే భారతదేశం తన గొంతును తప్పనిసరిగా వినిపించవలసి ఉంది. మరి ఏం చేయనున్నారన్న విషయం తేలాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే..