పాకిస్తాన్‌లోని అడియాలా జైలు గేటు బయట మంగళవారం అర్ధరాత్రి హైడ్రామా

పాకిస్తాన్‌లోని అడియాలా జైలు గేటు బయట మంగళవారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను పరామర్శించేందుకు వచ్చిన ఆయన సోదరీమణులపై పోలీసులు చేసిన దాడి ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. చీకటిలో జరిగిన ఆ అమానుషం… పాకిస్థాన్ పాలన వ్యవస్థ ఎంత దిగజారిందో మరోసారి ప్రపంచానికి చూపించింది.

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని.. పీటీఐ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ రెండేళ్లుగా తోషాఖానా కేసుతో పాటు పలు అవినీతి కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనతో పాటు ఆయన భార్యపైనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం ఇమ్రాన్‌ ఖాన్‌ అడియాలా జైలులో ఉన్నారు. ప్రతి వారంలా ఆయన కుటుంబ సభ్యులకు కొన్ని నియమిత రోజుల్లో ఆయనను కలిసేందుకు అనుమతి ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం షెడ్యూల్‌ ప్రకారం సాయంత్రం ఆయన సోదరీమణులు అలీమా ఖాన్, డాక్టర్ ఉజ్మా, నోరీన్ ఖాన్ అడియాలా జైలుకు చేరుకున్నారు. అయితే, ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జైలు అధికారులు అనుమతి లేదని స్పష్టంగా చెప్పేసారు. కారణం ఏమిటో వెల్లడించలేదు. అంతే… మూడు మహిళలు ఆ జైలు ప్రధాన గేటు వద్దే కూర్చుని తమ నిరసనను ప్రారంభించారు. జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో దాదాపు 10 గంటలు జైలు బయట కూర్చున్నారు. జైలు వెలుపలే బైఠాయించి ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు నిశ్శబ్దంగా నిరసన చేశారు. ఈ నిశ్శబ్దమే పాక్ అధికారులకు అసహనంగా అనిపించినట్టుంది. అర్థరాత్రి సమయంలో చీకటి మరింతగా కమ్ముకుంటున్న వేళ పోలీసులు అకస్మాత్తుగా ఆ ప్రాంతంలోని లైట్లన్నింటినీ ఆఫ్ చేశారు. బాహ్య ప్రపంచం కళ్లకు కనబడకుండా… మీడియా కెమెరాలను దూరంగా పంపేశారు. చీకటిగా ఉన్న సమయంలో..ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతాన్ని నీటితో నింపేసి భయపెట్టే వాతావరణం సృష్టించారు. ఆ తడి నేలపై నిలబడటానికే ఇబ్బంది. అదే సమయంలో… మహిళలపై దాడి ప్రారంభమైంది.

ఇమ్రాన్‌ఖాన్‌ సోదరీమణలను రోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చారు. అంతేకాక వారిని లాగుతూ నేలపై నెట్టివేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. పాకిస్తాన్ పోలీసుల అమానుషత్వం మళ్లీ బయటపడింది. ఈ నేపథ్యంలోనే నోరీన్‌ ఖాన్‌ తన అనుభవాన్ని బయటపెట్టారు. ఒక మహిళా పోలీస్ అధికారి నా జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లారు… నా కాళ్లు లాగుతూ తీసుకెళ్లారు. పంజాబ్ పోలీసులు రాక్షసుల్లా ప్రవర్తించారు. ఇంత దిగజారుతారని ఊహించలేదు… అని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. తనస్పృహ కోల్పోయేంత వరకు లాగి ఈడ్చారని ఆమె వెల్లడించారు. ఇక అలీమా ఖాన్ కూడా అదే వేదనను పంచుకున్నారు. మాకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదు. మా మీద దాడి చేశారు. నోరీన్‌ను బలవంతంగా లాగినప్పుడు ఆమె చచ్చిపోతుందేమో అన్న భయం ఏర్పడింది… అని ఆమె వణుకుతూ తెలిపారు. అయితే ఇది సాధారణ పోలీస్ ఆపరేషన్ కాదు… ఇది ఒక కుటుంబాన్ని అవమానించే ప్రయత్నమా? లేక ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిలుస్తున్నవారికి ఇది ఓ హెచ్చరికా? అన్న ప్రశ్నలు ఇప్పుడు పాకిస్థాన్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి.

ఈ దాడి వెనుక పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఉన్నాడని.. ఇమ్రాన్ కుటుంబం బహిరంగంగా ఆరోపిస్తోంది. గత సెప్టెంబరులోనే ఇమ్రాన్ ఖాన్ తన కుటుంబంపై అసిమ్ మునీర్ కక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం చట్టం కాదు… అసిమ్ మునీర్ ఇష్టం నడుస్తోంది అని ఇమ్రాన్ గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు జరిగిన ఈ ఘటన… ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ ఘటనపై PTI పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఈ విధంగా దాడి చేయడం పాక్ ప్రభుత్వ దమనపాలనకు నిదర్శనమని.. లైట్లు ఆఫ్ చేసి, నీళ్లు పోసి, చీకటిలో మహిళలను ఈడ్చుకుపోవడం… ఇది క్రూరత్వం కాకపోతే ఇంకేమిటని ప్రశ్నించింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే ఏకాంత నిర్బంధంలో ఉన్నారని, ఆయనకు కనీస మానవ హక్కులు కూడా ఇవ్వటం లేదని కుటుంబ సభ్యులు గత కొన్ని రోజులుగా వాదిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ఆయనను చూడటానికి వెళ్లిన సోదరీమణులపై దాడి జరగడం… పాక్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని పెంచుతోంది.