“భారత దేశపు చరిత్ర” జరిగింది ఇదే…

మన దేశానికి బంగారు పిచ్చుక అన్న పేరుందని మీకు తెలుసా…ఒకప్పుడు మన దేశంలో రత్నాలను రాసులు పోసి వీధుల్లో అమ్మేవారట.. ప్రపంచంలోనే అత్యంత సంపద మన దేశంలో పోగుపడి ఉండేదట. మనదేశంలో మరెన్నో దేశాలు వాటికి రాజులు ఉండేవారు. వారంతా తమ సంపదను బంగారం వజ్రాల రూపంలో దాచుకునేవారు. దాంతో ఈ సంపదను దోచుకోవడానికి విదేశీయులు మన దేశంపై దండెత్తారు. చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు, కానీ మొఘలులు ఇక్కడ స్థిరపడ్డారు. వాళ్లు సుమారు 400 సంవత్సరాలు పాలించారు. ఎన్నో ఏళ్లు పాలించి అందినకాడికి దోచుకున్నారు. ఆ తర్వాత వ్యాపారం పేరుతో బ్రిటిష్ వారు వచ్చారు. ఇక్కడే పాతుకుపోయి 200 ఏళ్లు దోచుకున్నారు. మొత్తం 600 ఏళ్ల బానిసత్వం, పోరాటాలు ఎదుర్కొన్నప్పటికీ మనదేశం ఇప్పటికీ సంపన్న దేశంగానే ఉంది. నేటికీ అమెరికా, బ్రిటన్, రష్యా వంటి మహా శక్తులతో కలసి మన దేశం అడుగులు వేస్తోంది. మన సంపదను విదేశీయులు కొల్లగొట్టినా.. భారత్ సుభిక్షంగానే అన్నిరంగాల్లోనూ వెలుగొందుతోంది. దోపిడీ పాలకుల్లో బ్రిటీష్ వారు అత్యధిక సంపదను దోచుకుని దూరమయ్యారనే చెప్పాలి. నిధి ఎక్కడ కనిపించినా దోచుకుని స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని చాలా కాలం పాటు పాలించారు. బ్రిటిష్ వారు దాదాపు 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని బానిసగా ఉంచుకున్నారు. ఈ కాలంలో బ్రిటిష్ వారు భారతదేశ వనరులను విచ్చలవిడిగా దోచుకున్నారు, అయితే బ్రిటీష్ పాలకులు దాదాపు 200 సంవత్సరాలలో భారతదేశంలో దాదాపు 45 ట్రిలియన్ డాలర్లు దోచుకున్నారు. 1757 – 1947 మధ్యకాలంలో వారు భారతదేశం నుండి సుమారు 80 వేల లక్షల కోట్ల రూపాయలను దోచుకున్నారు. ఆ మొత్తం నేడు బ్రిటన్ వార్షిక స్థూల జాతీయోత్పత్తి కంటే దాదాపు 15 రెట్లు ఎక్కువ. భారతదేశ వలసరాజ్యం వల్ల బ్రిటన్ గణనీయమైన ఆర్థిక ప్రయోజనం పొందలేదని బ్రిటన్ ప్రజలు అనుకుంటున్నారు, అయితే వాస్తవం దీనికి భిన్నంగా ఉంది.

బ్రిటీష్ ప్రభుత్వం ‘బంగారు పక్షి’ లాంటి మన దేశపు రెక్కలను ఎగరలేని విధంగా కత్తిరించింది. బ్రిటీష్ వారు 1757 నుండి 1947 వరకు అంటే 190 సంవత్సరాలు మన దేశాన్ని పాలించారు. ప్లాసీ యుద్ధంలో విజయం సాధించిన తరువాత, బ్రిటిష్ వారు భారతదేశంలో తమ ఆధిపత్యాన్ని స్థాపించారు. దీని తరువాత, 1858 లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన క్వీన్ విక్టోరియా పేరుకు బదిలీ చేయబడింది. భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందింది. బ్రిటిష్ పాలన ముగిసింది. ఈ నియమాన్ని వలసవాదం అంటారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆర్థిక దోపిడీకి, రాజకీయ అణచివేతకు, సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి గురిచేశారు. వారు భారతదేశంలో అనేక కొత్త పరిశ్రమలను కూడా స్థాపించి ఆర్థికాభివృద్ధికి తోడ్పడినప్పటికీ, భారతదేశ వనరులను, సంపదను అడ్డూ అదుపు లేకుండా దోచుకున్నారనడంలో సందేహం లేదు. బ్రిటీష్‌ వలస పాలకులు అత్యధిక సంపద దోచుకున్న దేశాల జాబితాను చూస్తే అందులో భారత్‌ ముందు వరుసలో నిలుస్తుంది. ఆ సంపద ఇప్పుడు మన చేతిలో ఉంటే ఇండియా రేంజ్‌ మరోలా ఉండేది. పాలన పేరుతో దశాబ్దాల పాటు భారత్‌ను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు బ్రిటీషర్లు. బంగారం, వజ్ర వైడూర్యాలు మొదలుకొని విలువైన సంపదను తమ దేశానికి తరలించుకుపోయారు. బ్రిటీషర్లు దేశాన్ని వదిలి పోయే నాటికి ఇక్కడ ఇంకేమీ మిగల్లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆ సంపదంతా రాజ ప్రసాదాల్లోనూ, బ్రిటీష్‌ మ్యూజియంలోనూ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వాటిని తిప్పి పంపించాలని భారతదేశం ప్రొటోకాల్ పాటిస్తూ పలు సందర్భాలలో కోరడం జరిగింది. అందుకు సిగ్గు లేకుండా వారేమన్నారో తెలుసా.. ఒకప్పడు దేశంలోని ఎన్నో రాజ్యాల రాజులు బ్రిటిషర్లపై గౌరవంతో సమర్పించిన కానుకలనీ, వాటిని వెనక్కు ఇవ్వలేమని స్పష్టం చేసారు. తెల్లదొరల దోపిడి గురించి చెప్పాలంటే 400 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకోవాలి. ఆనాడు మొఘ‌ల్ చ‌క్రవ‌ర్తి నూరుద్దీన్ మ‌మ‌హ్మ‌ద్ జ‌హంగీర్ పుట్టిన రోజు. మొఘ‌ల్ ద‌ర్బార్‌లో తులాభారం జ‌రుగుతోంది. జహంగీర్ బరువుకు సరిపడే వెండి, బంగారు నాణేలు, ఆభ‌ర‌ణాలు, విలువైన వ‌స్తువులు తూకం వేస్తూ పేద‌ల‌కు పంచిపెడుతున్నారు. అప్పట్లో అదో ఆనవాయితీగా జరిగేది.

ఔరంగజేబు పాలన కొనసాగుతున్న కాలంలో భారతదేశం ప్రపంచంలోనే వాణిజ్య వ్యాపారాలు కలిగిన అత్యంత సంపన్న దేశం. అప్పట్లో మన దేశం నుంచి విదేశాలకు ఎడారి దారులలో ఒంటెల ద్వారా సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు ఎగుమతి చేసేవాళ్లు. ఓ అంచనా మేరకు ప్రపంచ మొత్తం జీడీపీలో పావు వంతు భాగం ఇక్కడి నుంచే అని సమాచారం. అదే సమయంలో ఇంగ్లండ్ వాటా ప్రపంచ జీడీపీలో కేవలం 2 శాతమే ఉండేది. ప్లాసీ యుద్ధం తర్వాత ఆ ఘనతంతా గతంగా మారిపోయింది. 1947లో భారత్ నుంచి వెళ్లిపోయినపుడు, ఆంగ్లేయులు తమ పడవల నిండా అమూల్యమైన సంపదను నింపుకుని వెళ్తే, ఇండియా ఖాళీ సంచీగా ఉండిపోయింది. మన దేశం నుంచి బ్రిటీషర్లు ఎత్తుకెళ్లిన విలువైన సంపదలో కోహినూర్ డైమండ్ ఒకటి.. కోహినూర్‌ డైమండ్.. మన దేశాన్ని బ్రిటిష్ వారు దోపిడీ చేసారనడానికి సజీవసాక్ష్యం..మరో దేశ ఘన వైభవానికి ఆ వజ్రం సాక్ష్యం. మన గోల్కొండ సామ్రాజ్యంలో దొరికి.. ఎక్కడెక్కడో తిరిగి.. చివరకు బ్రిటన్ రాణి కిరీటంలో చేరిపోయింది. దానిని కూడా వెనక్కు ఇవ్వాలన్న విషయంపై ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. క్వీన్‌ ఎలిజబెత్ 2 మరణంతో కోహినూర్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అత్యంత విలువైన ఈ వజ్రాన్ని వెనక్కి ఇచ్చేయాలంటూ… భారత్‌లో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోహినూర్‌ తిరిగి తమకు ఇచ్చేయాలంటూ మన దేశం కోరుతుంటే.. మాకివ్వాలంటే మాకివ్వాలంటూ తగువుకు పాకిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్‌ దేశాలు ముందుకు వస్తున్నాయి . వజ్రంపై హక్కులు తమకే ఉన్నాయంటూ వితండవాదం చేస్తున్నాయి. కోహినూర్ వజ్రాన్ని వదులుకోవడానికి ఇంగ్లండ్ ఇష్టపడటం లేదు. కోహినూర్ వజ్రాన్ని తాము దోచుకోలేదనీ, హక్కుగా పొందామని వాదిస్తోంది. ప్రస్తుత మార్కెట్‌లో కోహినూర్ వజ్రం విలువ దాదాపు పదికోట్ల పౌండ్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు వెయ్యి కోట్లు ఉంటుంది. కానీ మొన్నటి ప్రధాని రిషీ సునాక్ కాలంలోనూ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రధాని స్టార్మర్‌‌ను మన ప్రధాని మోదీ ఈ మధ్య జరిగిన భేటీ సందర్భంగా కోరారు. అయితే అదంత సులభం కాదు.

రాచరిక వ్యవస్థ బలంగా ఉన్న యునైటెడ్ కింగ్డం ఇలాంటివి వెనక్కు ఇస్తూ పోతే ప్రపంచ దేశాలన్నింటికీ తమ సంపద వెనక్కు ఇవ్వాల్సి ఉంటుందని వారికి తెలుసు. అందుకే వేరు వేరు కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నమే చేస్తూ వస్తున్నారు. భారత్‌ను పరిపాలించిన బ్రిటన్‌ ఇక్కడి నుంచి ఎంతో విలువైన సంపదను తమ దేశానికి దోచుకెళ్లింది. కానీ మనం బ్రిటన్‌ రాణి కిరీటంలో ఉన్న కోహినూర్‌ వజ్రం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. నిజానికి భారతీయ సంస్కృతి, చరిత్రను తెలియజేసే ఎన్నో వెలకట్టలేని కళాఖండాలను మనదేశం నుంచి ఎత్తుకెళ్లారు తెల్లదొరలు. ఇప్పటికీ బ్రిటన్‌లోని పలు మ్యూజియాల్లో చెక్కు చెదరకుండా ఉన్నాయి. కోహినూర్‌తో పాటు వీటిని కూడా తిరిగి ఇవ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఖజురహో దేవాలయంలో ఉండే హరిహర విగ్రహం అప్పట్లో అపహరణకు గురైంది. ఎన్నో చేతులు మారి చివరికి లండన్‌లోని బ్రిటిష్‌ మ్యూజియానికి చేరింది. 1862లో బిహార్‌లోని బగల్‌పూర్‌ జిల్లా సుల్తాన్‌గంజ్‌ ప్రాంతంలో రైల్వే నిర్మాణంలో బయటపడ్డ బుద్ధుడి విగ్రహం బర్మింగ్‌హామ్‌ మ్యూజియంలోనే ఉంది. టిప్పు సుల్తాన్‌ మరణించగానే ఆయన గదిలో ఉన్న విలువైన వస్తువుల్ని ప్రత్యర్థులు దోచుకెళ్లారు. ఖడ్గం, టిప్పు సుల్తాన్‌ ఉంగరం, అత్తరు, చెక్కతో చేసిన పులి బొమ్మ ప్రస్తుతం బ్రిటన్‌లో వేర్వేరు మ్యూజియాల్లో కనిపిస్తాయి. మొఘల్‌ సామ్రాజ్య చక్రవర్తి షాజహాన్‌ మద్యం తాగడానికి ఉపయోగించిన వైట్‌ నైఫ్రైట్‌ రాయితో తయారు చేసిన ఓ పాత్ర, చక్రవర్తి మహారాజా రంజిత్‌ సింగ్‌ బంగారపు సింహాసనం.. ఇలా అత్యంత అరుదైన, విలువ కట్టలేని వస్తువులు చాలానే కొల్లగొట్టారు. ప్రస్తుతం 120కిపైగా అరుదైన శిలలపై చెక్కిన శిల్పాలు, శాసనాలు బ్రిటన్ మ్యూజియంలో ఉన్నాయి. వాటిని తిరిగి భారత్‌కు తీసుకురావడం కోసం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, యూనెస్కో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు కోహినూర్‌ని ఇండియాకు తీసుకురావాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.