30 రోజుల్లో అమెరికాలో పేలనున్న పొలిటికల్‌ బాంబు

అమెరికా రాజకీయాలను, న్యాయవ్యవస్థను మాత్రమే కాదు… ప్రపంచవ్యాప్తంగా శక్తివంతులైన నేతలు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల వరకు చిచ్చుపెట్టిన ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం మరోసారి కలకలం రేపుతోంది. ఇంతకాలం గోప్యంగా ఉన్న ఫైల్స్‌ బయటకు వస్తే అగ్రరాజ్యపు శక్తివంతమైన వర్గాలు ఏవేవి బయటపడతాయో అన్న ఆందోళన నడుస్తున్న వేళ… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకుని రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ను బహిర్గతం చేసే బిల్లుపై ట్రంప్‌ సంతకం చేసి.. దాన్ని అధికారికంగా చట్టబద్ధం చేశారు.

అమెరికాతోపాటు ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టేందుకు ట్రంప్‌ సిద్ధమయ్యారు. ఈ బిల్లుపై తాను సంతకం చేసినట్టు ట్రూత్‌ సోషల్‌ ద్వారా వెల్లడించారు. ఎప్‌స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్‌పై తాను సంతకం చేశానని.. డెమోక్రాట్లకు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న అనుబంధాలు త్వరలోనే బయటపడవచ్చంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ బిల్లును బహిర్గతం చేయడంపై కాంగ్రెస్‌లో ఓటింగ్‌ జరిగింది. ప్రతినిధుల సభలో 427-1 ఓట్ల తేడాతో ఆమోదం పొందగా.. సెనెట్‌లో ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో రాజకీయ పార్టీలకు అతీతంగా పారదర్శకతపై అంగీకారం ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ట్రంప్‌ సంతకం చేసి.. దాన్ని అధికారికంగా చట్టబద్ధం చేశారు. దీంతో ఇప్పుడు అమెరికా న్యాయశాఖ అన్ని ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ను 30 రోజుల్లో బయటపెట్టాల్సిందే. అందులో 2019లో జైలులో ఎప్‌స్టీన్‌ అనుమానస్పదంగా మరణించిన తర్వాత జరిగిన దర్యాప్తు నివేదికలు కూడా ఉన్నాయి. బాధితుల పేర్లు, దర్యాప్తును ప్రభావితం చేసే వివరాలకు మాత్రమే మినహాయింపు ఉంది.

ట్రంప్‌ ఇదేవేళ డెమోక్రాట్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఎప్‌స్టీన్‌ వ్యవహారాన్ని తమ విజయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయ ఆయుధంగా డెమోక్రాట్లు ఉపయోగిస్తున్నారని, ఇంతకాలం ఈ ఫైల్స్‌ను బయటపడకుండా అడ్డుకుంటూ వచ్చిందీ వారేనని ధ్వజమెత్తారు. డెమోక్రాట్ల అసలు రూపం… ఎప్‌స్టీన్‌తో వారి సంబంధాలపై ఉన్న నిజాలు త్వరలో బయటకు రావచ్చు. ఎందుకంటే… నేను ఇప్పుడు ఫైల్స్‌ విడుదల బిల్లుపై సంతకం చేశాను అని ట్రంప్‌ ప్రకటించడంతో… వాషింగ్టన్‌లో పొలిటికల్‌ హీట్‌ మరింత పెరిగింది. ఈ బిల్లుకు ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్ అనే పేరు పెట్టారు. పారదర్శకత విషయంలో ఇది తన వ్యక్తిగత విజయం అని కూడా ట్రంప్‌ తెలిపారు. ఈ నిర్ణయంతో అమెరికా రాజకీయాల్లో ఒక పెద్ద వణుకు పుట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం.. అమెరికాలో తీవ్ర దుమారం రేపుతోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బాలికలు, యువతులను డబ్బు ఆశ చూపించి.. ఇళ్లకు రప్పించి… అఘాయిత్యాలకు, లైంగిక వేధింపులకు గురిచేసిన దారుణ ఆరోపణలు ఎప్‌స్టీన్‌పై ఉన్నాయి. అతను ఒక వ్యక్తి మాత్రమే కాదు, అతని వెనుక భీకరమైన నెట్వర్క్ ఉందని, ప్రభావవంతులు ఇందులో పాలుపంచుకున్నారనే ఆరోపణలు అమెరికా సమాజాన్ని కుదిపేశాయి. అతడి ఎదుట న్యాయం నిలబడబోతుందని అనుకునే లోపే… 2019లో జైలులోనే అతను మరణించడం మరింత అనుమానాలకు తావిచ్చింది. అది ఆత్మహత్య అని ప్రభుత్వం చెప్పినా, అనేక ప్రముఖులు, నిపుణులు ప్రభుత్వ కథనాన్ని ఖండిస్తూ… ఇది పెద్ద కుట్ర అని ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరు కూడా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 1990లు, 2000లలో ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌నకు పరిచయం ఉంది. ట్రంప్ స్వయంగా ఒకసారి అతను గొప్ప వ్యక్తి, యంగ్ గర్ల్స్ అంటే ఇద్దరికీ ఇష్టం అని చెప్పిన ఆడియో కూడా వైరల్‌ అయ్యింది. కానీ ట్రంప్ ఎప్‌స్టీన్ ద్వీపానికి వెళ్లలేదని, అతని విమానంలో ప్రయాణం చేయలేదని వైట్‌హౌస్ చెబుతోంది. 2002 తర్వాత ఎప్‌స్టీన్‌ను దూరంపెట్టానని ట్రంప్ చెప్పుకుంటారు. అయితే ట్రంప్‌తో ఎప్‌స్టీన్‌ పరిచయం ఉన్నది నిజమే కానీ… ట్రంప్‌ ఎలాంటి తప్పు చేయలేదని, ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవని తప్పకుండా పేర్కొంటూ వైట్‌హౌస్ నాయకత్వం, హౌస్ స్పీకర్ జాన్సన్‌ కూడా ప్రకటించారు. ఇంతకాలం ఈ ఫైల్స్ విడుదలకు ట్రంప్‌ దూరంగా ఉన్నప్పటికీ… పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు, ఎన్నికల సమీకరణలు, పారదర్శకతపై డిమాండ్ల మధ్య ఆయన యూటర్న్ తీసుకొని… ఫైల్స్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రిపబ్లికన్ సభ్యులందరూ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కూడా ఆయన స్వయంగా కోరడం… ఈ నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలకు బలం చేకూరుస్తోంది.

తాజా పరిస్థితుల్లో 30 రోజుల్లో ఈ ఫైల్స్ బయటకు వస్తే… అమెరికా రాజకీయ వ్యవస్థ, ప్రముఖుల పేర్లు, వ్యాపారవేత్తలతో సంబంధాలు… ఇంకా ఎన్నో తెలియని చీకటి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎప్‌స్టీన్‌ నెట్వర్క్ ఎంత లోతుగా వెళ్లిందో, ఇందులో ఎవరు ఉన్నారో, ఎవరెవరిపై ప్రభావం పడుతుందో అన్న భయం ఇప్పటికే వాషింగ్టన్‌ నుంచి వాల్‌స్ట్రీట్‌ వరకు కనిపిస్తోంది. ఈ ఫైల్స్‌ విడుదలతో అమెరికా రాజకీయ దిశే మారుతుందా? లేక మరికొన్ని వారాలు అగ్రరాజ్యానికి కలవరమా? అన్న ప్రశ్నలతో రాబోయే రోజులు అత్యంత కీలకంగా మారబోతున్నాయి.