
వేయి తుమ్మెదలు ఝుమ్మంటూ చేసే ఓశబ్దం వినగానే జనం తలలు పైకి లేస్తాయి. ఎందుకంటే అందరికీ ఆ శబ్దం బాగా గుర్తుండి పోయింది. దానిపేరే డ్రోన్.. పెళ్లిల్లలో ఫొటోలు తీయడం దగ్గర నుంచి రైతుల తమ వ్యవసాయం కోసం పురుగుమందులు చల్లేదాకా డ్రోన్ మనుషుల జీవితాలతో మమేకమైపోయింది. అసలు ఓ డ్రోన్ షాట్ లేనిదే ఏ వీడియో కూడా ఉండటం లేదు. డ్రోన్ గురించి ఒకప్పుడు ఆశ్చర్యంగా చదివేవాళ్లం. నాలుగు చక్రాలు బ్యాటరీతో తిరుగుతుండగా అది పైకి లేవడాన్ని ఆశ్చర్యంగా చూసాం..కానీ నేడు ఓ టీనేజర్ నిముషాల్లోనే డ్రోన్‌ను గాల్లోకి లేపి ఎక్కడ కావాలంటే అక్కడ సురక్షితంగా ఆపరేట్ చేయడం చూస్తే ఔరా అనిపిస్తోంది. ఒకప్పుడు డ్రోన్ ప్రయోగించడాన్ని దూరం నుంచి చూశాం. ఇప్పుడు ప్రతీ సందర్భంలో ఏదో రకంగా ఉపయోగించుకుంటున్నాం. వివాహాది శుభకార్యాలకు డ్రోన్ కెమెరా ఉండాల్సిందే. క్రిమిసంహారకాల పిచికారీ కోసం ఇప్పుడిప్పుడే డ్రోన్ల వాడకం మొదలైంది. ఈ హవా ఇక్కడితో ఆగిపోయేలా కనిపించడం లేదు. జనం చాలా క్రియేటివ్‌గా వాటిని ఉపయోగించడం చేస్తున్నారు. వైద్యరంగంలో, అగ్నిప్రమాదాలు, భూకంపాలు లాంటి ప్రక్రుతి వైపరీత్యాలు సంభవించినప్పుడు డ్రోన్లు ఉపయోగించుకుని ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించడం చేస్తున్నారు. నిజానికి చాలా తక్కువ కాలంలోనే డ్రోన్ అన్నది జనం అందుబాటులోకి వచ్చిందని చెప్పాలి. అయితే ఈ హవా ఇక్కడితో ఆగిపోయేలా కనిపించడం లేదు. డ్రోన్..పరిమితి అపారంగా విస్తరిస్తోంది..అవి మంచి కోసం చెడు కోసం కూడా ఉపయోగపడే అవకాశం ఉంటోంది. సరిహద్దుల్లో పహరా సమయంలో సైనికుడిగా మారుతోంది డ్రోన్.. ఇటు నగరాలలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అవతారం కూడా ఎత్తుతోంది. ప్రకృతి విపత్తుల గురించి ముందే చెప్పుకున్నాం.. ఆ సమయంలో మనసున్న వలంటీర్లా సేవలు అందిస్తోంది. ప్రాణాలు కాపాడుతోంది. సెల్‌ఫోన్ తర్వాత.. అంతగా జనానికి దగ్గరవుతున్న ఆవిష్కరణ ఇదే కావచ్చని అంటున్నారు విశ్లేషకులు.
డ్రోన్..అంటేనే అందరికీ తెలుస్తుంది. దీనికి తెలుగులో పేరు లేదు..ప్రస్తుతానికి ఇది మహాభారతంలో ద్రోణా చార్యుడంత కీలకమైపోయింది. బంధువుల పెండ్లిలో డ్రోన్ కెమెరాలు వాడారనో, పక్క ఊరి రైతులు డ్రోన్‌తో క్రిమిసంహారకాలు పిచికారీ చేశారనో.. ఏదో ఓ రూపంలో వీటి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మారుమూల ప్రాంతాలకు ఔషధాలను పంపడానికి కూడా వైద్యులకు అక్కరకు వస్తున్నాయి. ప్రభుత్వానికి భూముల సర్వేకు, కొలతలకు, పహరాకు.. ఒకటేమిటి ప్రతిచోటా, ప్రతిరంగంలో డ్రోన్ రంగంలో దిగాల్సిందే. ఇందుకలడందు లేడని సందేహం వలదు అన్న చందంగా డ్రోన్ ప్రతీ రంగంలోకి దూసుకుపోతోంది. రానున్నది నిజంగానే డ్రోన్ యుగంగానే చెప్పుకోవచ్చు. డ్రోన్ అనేది నిజానికి ఓ రోబో లాంటిది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ టెక్నాలజీ అందిస్తోన్న శక్తివంతమైన కానుకగా చెప్పుకోవచ్చు. సాంకేతిక పరిభాషలో అన్మాన్డ్ ఏరియల్ వెహికిల్ లేదా ‘యూఏవీ’ అని పిలుస్తారు. కచ్చితత్వం, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే శక్తి దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. హెలికాప్టర్‌తో పోలిస్తే అత్యంత చవకైనది.. వచ్చే రెండేండ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద డ్రోన్ తయారీదారు అవుతుందని అంచనా. ఇప్పటికే మనం డ్రోన్ల వినియోగంలో అగ్రదేశాలకు దీటుగా నిలుస్తున్నాం. ఓ ఇరవై వేలుంటే చాలు చేతిలోకి డ్రోన్ వచ్చేంత చవకగా మారిపోయింది. ఆమెజాన్లో సైతం ఈ డ్రోన్లు రోజుల వ్యవధిలోనే దొరికిపోతున్నాయి. డ్రోన్‌తో తీసిన వీడియో షాట్లు లేనిదే ఆ సినిమాకు అంత అందం చేకూరడం లేదు. ఎంత చేయితిరిగిన ఫొటోగ్రాఫర్ అయినా సరే.. నేల మీదినుంచే ఫొటోలు తీస్తాడు. మహా అయితే స్టాండ్ మీద నిలబడి దృశ్యాన్ని బంధిస్తాడు. ఆకాశంలోకి హెలికాప్టర్, ఎయిర్ బెలూన్ లాంటివేవీ లేనట్టయితే ఎట్టి పరిస్థితిలోనూ ఎగరలేడు. ఆ పని డ్రోన్ చాలా తేలికగా చేయగలదు. అలా చేస్తోంది కూడా. డ్రోన్ కెమెరా వచ్చాక ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ విభాగాల్లో సృజనాత్మకత కొత్తపుంతలు తొక్కుతున్నది. ఛాయాగ్రాహకులకు కొత్త కోణం దొరికింది. దృశ్యానికి సమగ్రత వచ్చింది.
రాజకీయ నాయకుల ర్యాలీలు, సభలు, సమావేశాలను మరింత బాగా కండ్లకు కడుతున్నారు. కస్టమర్లకు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ అందిస్తున్నారు. దీనివల్ల చాలా తలనొప్పులు తగ్గాయి. ఎక్కడెక్కడి నుంచో పెద్దపెద్ద క్రేన్లు, స్టాండ్లు తెప్పించాల్సిన అవసరం లేకుండాపోయింది. గతంలో, అంతెత్తు మీదినుంచి షూట్ చేస్తున్నప్పుడు.. ప్రమాదవశాత్తు కిందపడి గాయాలపాలైన వారూ ఉన్నారు. లక్షల విలువైన కెమెరా చేజారితే అంతే సంగతులు. కానీ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన డ్రోన్‌ను తరలించడానికి పెద్దగా ఏర్పాట్లు అవసరం ఉండదు. తరలించడం పెద్ద కష్టమేం కాదు. ఓ మోస్తరు సూట్‌కేస్ సరిపోతుంది. రియల్ ఎస్టేట్ అడ్వర్టయిజింగ్ రంగంలోనూ డ్రోన్లు సంచలనాలు సృష్టిస్తున్నాయి. వార్తా పత్రికలు, ఛానెళ్లు సైతం చాలా సందర్భాలలో డ్రోన్ల సాయం తీసుకుంటున్నాయి. ప్రత్యేకించి ప్రకృతి విపత్తుల సమయంలో అవి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లా పనిచేస్తున్నాయి. నిర్మాతలు డ్రోన్‌ను సృష్టించిన శాస్త్రవేత్తకు పాదాభివందనం చేయాల్సిందే. ఆ ఒక్క ఎక్విప్‌మెంట్‌తోనే చాలా కష్టాలు తీరిపోతున్నాయి. కోట్ల రూపాయల ఖర్చులు తప్పిపోతున్నాయి. ప్రీప్రొడక్షన్ దశలో.. లొకేషన్లు ఎంపిక చేసుకోవడం, పర్మిషన్లు తీసుకోవడం.. చాలా సులభం అయిపోతుంది. షూటింగ్ సమయంలో లక్షలకు లక్షలు పోసి హెలికాప్టర్ అద్దెకు తీసుకోవాల్సిన ఇబ్బందీ లేదు. యుద్ధాలు, కార్ చేజింగ్‌లు, అగ్ని ప్రమాదాల్లో హీరో సాహసాలు..లాంటి ఎన్నో ద్రుశ్యాలను చవకగా షూట్ చేసుకోవచ్చు. ఏ హిమాలయ సౌందర్యాన్నో వెండితెర మీద చూపించాలంటే.. డ్రోన్ కెమెరాను మించిన మాధ్యమం లేదు. న్యూస్ రీల్, షార్ట్ ఫిల్మ్ చేయడానికి, అభివృద్ధి పనుల డాక్యుమెంటరీలు తీయడానికి డ్రోన్ కెమెరానే ఆశ్రయిస్తున్నారు.
ప్రారంభంలో ఆర్మీకే పరిమితమైన డ్రోన్లను ఇటీవలి కాలంలో వివిధ రంగాల్లో ఉపయోగించుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి. డ్రోన్ నడిపేందుకు అనేక నిబంధనలు ఉన్నాయి. మొదట్లో 2.4 గిగాహెడ్జ్‌కు ఎక్కువ, 2.4 గిగాహెడ్జ్‌కు తక్కువ కెపాసిటీతో రెండు రకాల డ్రోన్లు ఉండేవి. వీటిలో 2.4 గిగాహెడ్జ్ కంటే తక్కువ డ్రోన్లను నడిపేందుకే అనుమతి ఇచ్చేవారు. ఆ తర్వాత నిబంధనలను సడలించి వీటికీ పచ్చజెండా ఊపారు. కొత్తగా నానో, మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్ .. ఐదు రకాలుగా విభజించారు. నానో డ్రోన్ 250 గ్రాముల బరువు ఉంటుంది. దీన్ని నడపడానికి ఎలాంటి అనుమతులూ అవసరం లేదు. ఇది 50 అడుగుల ఎత్తు వరకూ వెళ్తుంది. అంతకుమించిన సామర్థ్యం ఉన్నా.. ఆ మేరకే నడిపించాల్సి ఉంటుంది. మైక్రో డ్రోన్ 250 గ్రాముల నుంచి 2 కిలోల బరువు ఉంటుంది. స్మాల్ డ్రోన్ 2 కిలోల నుంచి 25 కిలోల బరువు ఉంటుంది. మీడియం డ్రోన్ 25 కిలోల నుంచి 250 కిలోల బరువు ఉంటుంది. లార్జ్ డ్రోన్ 150 కిలోలకు మించి ఉంటుంది. వీటిని నడపడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ‘డీజీసీఏ’, సీఏఏ అనుమతులు తీసుకోవాలి. అనుమతితో పాటు రెండేళ్ల వ్యవధి కలిగిన పైలట్ లైసెన్స్, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ జారీ చేస్తారు. ఈ సంఖ్యను డ్రోన్‌పై అతికించాల్సి ఉంటుంది. ఎక్కడ కొనుగోలు చేశారు, ఎందుకు ఉపయోగిస్తారు అనే విషయాలతోపాటు డ్రోన్ లైసెన్స్ తీసుకునే వ్యక్తి ఆధార్‌కార్డ్ వంటి పూర్తి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. స్థానిక పోలీసుల అనుమతులూ తప్పని సరి. అనుమతులు లేకుండా డ్రోన్‌ను ఉపయోగిస్తే పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా మిలిటరీ ప్రాంతాలు, అణువిద్యుత్ కేంద్రాలు, సరిహద్దు రేఖలు, విమానాశ్రయాల దగ్గర నిషేధం విధించారు. ఈ నిబంధనలను కొద్దిపాటి మార్పులతో వివిధ రాష్ట్రాలలో అమలు చేస్తున్నాయి.