జూబ్లీహిల్స్‌లో డిపాజిట్‌ కూడా దక్కని బీజేపీ | Loguttu

అంతన్నాడు ఇంతన్నాడే అన్నట్లుంది కమలంపార్టీ పరిస్థితి. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ సవాల్‌ చేసినట్లే జరిగింది. పార్టీ అభ్యర్థికి డిపాజిట్‌ కూడా దక్కకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకొస్తామంటున్న పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. సరైన అభ్యర్థిని దించకపోవడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు కొందరు. అభ్యర్థి ఎంపికపై నేతల అసంతృప్తిని అధిష్ఠానం ఎందుకు పట్టించుకోలేదు. కనీసం పార్టీలో వాయిస్‌ ఉన్న నాయకులను కూడా ప్రచారానికి ఎందుకు దించలేదు? ఇప్పట్లో మీడియా ముందుకు రానని పార్టీ ఎమ్మెల్యేనే శపథం చేసే పరిస్థితి ఎందుకొచ్చింది?


బిజెపిలో ఫైర్ బ్రాండ్‌లకు కొదవ లేదు. పార్టీ కోసం ఎంతటి వారినైనా.. విమర్శించేందుకు వెనుకాడని నేతలున్నారు. అలాంటి ఫైర్ బ్రాండ్స్ నిజామాబాద్ జిల్లాలోనే ముగ్గురు ఉన్నారు. అయితే రాష్ట్ర బిజెపిలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ ఫైర్ బ్రాండ్స్ కి తెగ ఇరిటేషన్ వస్తోందట. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎంపీ అర్వింద్‌, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి ముగ్గురూ ముగ్గురే. ఈ ముగ్గురు నేతల ప్రసంగాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఎవరిపైనయినా ఈ ముగ్గురు నేతలు చేసే విమర్శలు నషాళానికి అంటేంత ఘాటుగా ఉంటాయి. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత…ఈ ముగ్గురు నేతలు మీడియా ముందు మాట్లాడేందుకు కూడా ఇష్టపడటంలేదు.


మైక్ దొరికితే మాటల మోతమోగించే ఫైర్‌బ్రాండ్‌ లీడర్స్‌ జూబ్లీహిల్స్‌ బైపోల్‌ తర్వాత సైలెంట్‌గా ఉంటున్నారట. ఉప ఎన్నికలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై కమలం పార్టీలో కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై బీజేపీలోని కొందరు ముఖ్య నేతలు మాట్లాడేందుకు ఆసక్తి చూపించకుండా దూరంగా ఉండిపోయారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయాలన్న సంకల్పంతో ఎంపీ అర్వింద్‌, రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి వంటి నేతలు తమ బాధ్యతగా కృషి చేస్తున్నారు. తమ స్పీచ్‌లతో యువతలో ఉత్సాహం నింపుతున్నారు. యువత పార్టీకి అట్రాక్ట్ అయ్యేలా సదరు నేతలు కష్టపడుతున్నారు. తామింత చేస్తున్నా అధిష్ఠానం తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. బాహాటoగా బయటికి చెప్పుకోలేకపోతున్నా… రాష్ట్ర బీజేపీలో కీరోల్ పోషిస్తున్న కొందరు ఇందూరు జిల్లా నేతలు జరుగుతున్న పరిణామాలపై లోలోన మధన పడుతున్నారట.


క్షేత్రస్థాయిలో పార్టీ కోసం తాము ఇంత కష్టపడుతున్నా.. జూబ్లీహిల్స్‌ అభ్యర్థి ఎన్నిక విషయంలో తమకు కనీస సమాచారం లేదంటూ కొందరు నేతలు ఫీల్ అవుతున్నారట. జూబ్లీహిల్స్‌ ఎన్నిక విషయంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డినే అడగండoటూ వెళ్లిపోయారు నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌. ఇక ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాజేష్‌రెడ్డి అయితే జూబ్లీహిల్స్‌ బైపోల్‌ తర్వాత మీడియా ముందుకే రావటం లేదు.
ఏకంగా మూడునెలలదాకా ఏ ఛానల్‌ డిబేట్‌కి కూడా వెళ్ళబోనని తనకు తాను ఆంక్షలు విధించుకున్నారట రాకేష్. రాజకీయాల్లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఎమ్మెల్యే గా ఎన్నికైన పైడి.. తర్వాత ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్నారు. నిధుల కోసం అసెంబ్లీలో సీఎంపైనే విరుచుకుపడ్డారు. ఒకప్పుడు ఆర్మూర్ లో మాజీ ఎమ్మెల్యే పై మాట్లాడటానికే బయపడేవారు. రాకేష్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ తర్వాత ఆర్మూర్ ప్రజలు ఆయనవైపు అట్రాక్ట్ అయ్యారు. మరోవైపు పార్టీ బలోపేతానికి సిన్సియర్‌గా పనిచేస్తున్న రాకేష్‌రెడ్డి.. జూబ్లీహిల్స్‌ ఎన్నిక తర్వాత కొంత నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.


జూబ్లీహిల్స్‌ అభ్యర్థి ఎంపికలో పొరపాట్లు, రాష్ట్ర నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగేలా ఉన్నాయని ఆర్మూర్‌ ఎమ్మెల్యే మధన పడుతున్నారట. ఎక్కడికి వెళ్లినా ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక పోతున్నారట. అందుకే ఏకంగా మూడు నెలలు మీడియా ముందుకు రావద్దని డిసైడ్ అయ్యారట. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఉన్నది హైదరాబాద్‌లోనైనా.. బీజేపీకి డిపాజిట్‌ కూడా రాని ఎఫెక్ట్‌ ఇందూరు నేతలపై పడిందంటున్నారు.