హసీనా ప్రాణాలతో బతికుండడానికి కారణం భారత్‌ -వాజేద్‌

బంగ్లాదేశ్‌ ఇప్పుడు రగులుతున్న నిప్పులా మారింది. ఎక్కడ చిన్న కల్లోలం చెలరేగినా దేశం మొత్తం తగలబడే పరిస్థితుల్లో ఉంది. మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఐసీటీ మరణశిక్ష విధించడంతో.. అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌పై ప్రమాదకర మేఘం కమ్ముకుంటున్న వేళ షేక్‌ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి హసీనా ప్రాణాలతో ఉండటానికి కారణం భారతేనని సాజిబ్‌ వాజేద్‌ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో భారత్‌కు ధన్యవాదాలు చెప్పడంతో పాటు.. బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వం, పాకిస్తాన్ ISI, అమెరికా బైడెన్ ప్రభుత్వంపై ఒక్కసారిగా బాంబులు పేల్చారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసినా.. ఏదొక మూల ఆందోళనలు చెలరేగే ప్రమాదం ఉంది. గతేడాది ఢాకాలో జరిగిన అల్లర్లలో మాజీ ప్రధాని షేక్‌ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడడంతో.. ఆమెకు మరణశిక్ష విధిస్తున్నట్టు ఐసీటీ కీలక తీర్పును వెలువరించింది. దీంతో అవామీలీగ్‌ పార్టీ బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే సైన్యం మోహరించడంతో.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే షేక్‌ హసీనా కుమారుడు.. సాజిబ్ వాజేద్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఢాకాలో చెలరేగిన హింస, అల్లర్లన్నిటి వెనక రాజకీయ కుట్ర ఉందని, ఆయుధాలు సాధారణ నిరసనకారులకు కాదు, వారిని ముసుగుగా ఉపయోగించిన మిలిటెంట్లకు ఐఎస్‌ఐ సరఫరా చేసి ఉంటుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హసీనా అధికారంలో ఉన్నప్పుడు అరెస్టయిన వేలాది మంది ఉగ్రవాదులను.. తాత్కాలిక ప్రభుత్వం, నొబెల్ అవార్డు గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో విడిచి పెట్టడం భారత్ భద్రతకే ముప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదులను విడుదల చేశారంటే… వారు తిరిగి నేరాలకు పాల్పడకపోతారనే హామీ ఎవరు ఇస్తారు? భారత్ సరిహద్దులకు ఈ ప్రమాదం నేరుగా పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.

మరోవైపు తన తల్లి హసీనా ప్రాణాలు ఇప్పుడు ఉన్నాయంటే అది భారత్ వల్లే. సంక్షోభ సమయంలో ఆమెను ఆదుకున్న ప్రధాని మోదీ ప్రభుత్వానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని సాజిబ్ వాజేద్ స్పష్టం చేశారు. ఢాకాలో అల్లర్లు జరిగినప్పుడు హసీనా ఇంట్లోనే ఉండి ఉంటే మిలిటెంట్లు ఆమెను చంపేసేవారని.. భారత్ సురక్షితంగా ఢిల్లీకి తరలించడం వల్లే ఆమె బ్రతికి ఉందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం భారతదేశానికి హసీనాను అప్పగించాలని అధికారిక అభ్యర్థన చేసిన నేపథ్యంలో… సాజిబ్ వాజేద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన న్యాయ విచారణ లేకుండా… రాజకీయ లక్ష్యాలతో నిర్మించిన కేసుల్లో… భారత్ ఎప్పటికీ నా తల్లిని అప్పగించదు అంటూ ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటరీ అనుమతి లేకుండా చట్టాలను సవరించడం, అనుభవం లేని జడ్జీలను రాజకీయ ఉద్దేశ్యాలతో నియమించడం, హసీనాకు న్యాయవాదులు పెట్టుకునే హక్కు ఇవ్వకపోవడం ఇవి అన్నీ న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేసిన ఉదాహరణలేనని ఆయన అన్నారు. విచారణకు ముందే 17 మంది జడ్జీలను ఒక్కసారిగా తొలగించడం… ఇదే ఆ దేశ న్యాయవ్యవస్థ స్థితి, అని ఆరోపణలు చేశారు.

ఇక బంగ్లాదేశ్‌లోని అంతర్గత రాజకీయాలపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రజాదరణ ఉందంటే… ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. దేశంలో రాజ్యాంగ విరుద్ధ ప్రభుత్వం ఉంది, ప్రజాస్వామిక విలువలు కోల్పోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక యూఎస్‌ మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పైనా సాజిబ్‌ ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ మార్పు కోసం జో బైడెన్‌ లక్షల డాలర్లు ఖర్చు చేశారని.. యూఎస్‌ఎయిడ్ ద్వారా నిధులు ప్రవాహం జరిగిందని, ఆ మొత్తాలు దేశీయ రాజకీయాలపై ప్రభావం చూపేందుకు ఉపయోగించబడ్డాయని ఆయన ఆరోపించారు. గత ఏడాదిలో బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న అల్లర్లు, ఆందోళనలన్నీ అంతర్జాతీయ ప్రభావాలతో ముడిపడి ఉన్నాయన్నరు.

అయితే ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమెరికా వైఖరి మారిందని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న ఉగ్రవాద ముప్పు, రాడికలైజేషన్, రాజకీయ అస్థిరతపై అమెరికా ఇప్పుడు వేరే దృక్కోణంతో చూస్తోందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు భద్రతను ప్రాధాన్యంగా చూస్తోందన్నారు. మొత్తం మీద… షేక్ హసీనా భవిష్యత్, బంగ్లాదేశ్ రాజకీయాలు, ప్రాంతీయ భద్రత.. అన్నీ ఒక క్లిష్టమైన దశలో ఉన్నాయి. భారత్—బంగ్లాదేశ్ సంబంధాలు ఈ పరిణామాల ద్వారా మరోసారి అంతర్జాతీయ దృష్టిలోకి వచ్చాయి. సాజిబ్ వాజేద్ చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలు… రాబోయే రోజుల్లో దక్షిణాసియా రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశముంది.