824 కోట్ల విలువైన భారీ డిఫెన్స్ డీల్‌కు ట్రంప్‌ గ్రీన్‌ సిగ్నల్‌

అమెరికాతో భారత వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం మరింత బలపడుతున్న వేళ… అగ్రరాజ్యం తాజాగా తీసుకున్న నిర్ణయం ఇండో-పసిఫిక్ ప్రాంత రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చేసేలా కనిపిస్తోంది. దాదాపు 824 కోట్ల విలువైన భారీ డిఫెన్స్ డీల్‌కు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో భారత్‌ అమెరికాల మధ్య రక్షణ రంగంలో కీలక అధ్యాయం ప్రారంభమైంది.

భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ సర్కారు రెండు అత్యంత కీలకమైన, అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను భారత్‌కు విక్రయించేందుకు అధికారికంగా అంగీకరించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన యాంటీ-ట్యాంక్ ఎఫ్‌జీఎం-148 జావెలిన్ మిస్సైళ్లు.. ఎం982ఏ1 ఎక్స్‌క్యాలిబర్ ప్రెసిషన్ గైడెడ్ ఆర్టిలరీ షెల్స్‌ను భారత్‌కు ఇచ్చేందుకు ట్రంప్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మొత్తం డీల్ విలువ 93 మిలియన్ డాలర్లు అంటే 824 కోట్లు. అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ రెండు డీల్స్‌కు కాంగ్రెస్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో యుద్ధ భూమిలో శత్రు ట్యాంకులనూ, సైనిక వ్యవస్థలనూ అత్యంత కచ్చితత్వంతో ఛేదించే కీలక సామగ్రిని భారత్‌కు అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. ఈ నిర్ణయాన్ని ధృవీకరిస్తూ డీఎస్‌సీఏ అధికారిక నోటిఫికేషన్ జారీ చేయడంతో, భారత్-అమెరికాల మధ్య రక్షణ రంగంలో ఒక కీలక అధ్యాయం మొదలైంది. భారత్‌కు అందించనున్న సామగ్రి జాబితా చిన్నదిగా కనిపించినా… దాని వ్యూహాత్మక విలువ మాత్రం అపారమని విశ్లేషకులు చెబుతున్నారు.

100 జావెలిన్ మిస్సైళ్లతో పాటు, ప్రత్యేకంగా డెమో చూపించే ఫ్లై-టు-బై రౌండ్, 25 కమాండ్ లాంచ్ యూనిట్లు, అధునాతన సిమ్యులేషన్ రౌండ్లు, ట్రైనింగ్ ఎయిడ్‌లు, విడి భాగాలు.. అన్నీ ఈ ప్యాకేజీలో ఉన్నాయి. దీనితోపాటు 216 యూనిట్ల M982A1 ఎక్స్‌క్యాలిబర్ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్, ఇవి ఒక్కసారి ప్రయోగించగానే కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు టార్గెట్‌పై 2-మీటర్ల ఖచ్చితతతో దాడి చేయగల సామర్థ్యం ఉన్నాయి. ఆధునిక యుద్ధరంగంలో ఇలాంటి ప్రెసిషన్-స్ట్రైక్ వ్యవస్థలు కలిగి ఉండటం… ఒక దేశం సైనిక శక్తి, సిద్ధత, ప్రతిస్పందన సామర్థ్యాలను పూర్తిగా మరోస్థాయికి తీసుకెళ్తుంది. ఈ మొత్తం డీల్‌కు అమెరికా సైన్యం జీవితకాల మద్దతు అందించనుంది. ఇక భారతదేశం ఒక ప్రధాన రక్షణ భాగస్వామి అని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిని కాపాడడం కోసం భారత సైన్యం మరింత బలపడటం అవసరమని నోటిఫికేషన్‌లో డీఎస్‌సీఏ పేర్కొంది. భారత్‌కు విక్రయం ద్వారా అమెరికా జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు ఇస్తుందని.. దక్షిణాసియా ప్రాంతంలో స్థిరత్వం, శాంతి, ఆర్థిక వికాసం అన్నీ బలోపేతమవుతాయని డీఎస్‌సీఏ స్పష్టంగా తెలిపింది. చైనా దూకుడుకు ప్రతిస్పందించడంలో భారత్ యొక్క సత్తా పెరగడం అమెరికా వ్యూహంలో ఒక ప్రధాన భాగమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా నుంచి భారత్‌కు ఆయుధాలు విక్రయించే ప్రధాన కాంట్రాక్టర్‌గా ఆర్‌టీఎక్స్ కార్పొరేషన్ వ్యవహరించనుంది. ఈ సంస్థ అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని అర్లింగ్టన్ కేంద్రంగా పనిచేస్తోంది. రాబోయే దశల్లో భారత రక్షణ శాఖ ఈ కంపెనీతో అధికారిక చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ డీల్‌ను చేపట్టడానికి అమెరికా ప్రతినిధులు భారత్‌కు రావాల్సిన అవసరం లేదని డీఎస్‌సీఏ స్పష్టం చేసింది. అదేవిధంగా, ఈ విక్రయం వల్ల అమెరికా సైనిక సిద్ధతపై ఏ మాత్రం ప్రతికూల ప్రభావం పడదని కూడా స్పష్టం చేసింది. ఈ డీల్ అమెరికాకు కూడా లాభదాయకమేనని డీఎస్‌సీఏ వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్‌ అనుభవాల తరువాత భారత వాయుసేన, భూసేన—గగనతల రక్షణ వ్యవస్థల బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. అత్యంత కఠిన పరిస్థితుల్లో, ఎత్తైన ప్రాంతాల్లో, సరిహద్దుల్లో… శత్రు డ్రోన్లు, హెలికాప్టర్లు, యుద్ధవిమానాలు, ట్యాంకులు ఎలాంటి దాడి చేసినా వెంటనే ప్రతిస్పందించే సామర్థ్యం సంపాదించాలని.. భారత సైన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే యూకేకు చెందిన థేల్స్ సంస్థతో భారత్ ఎల్ఎంఎం.. లైట్‌వెయిట్ మల్టీ-రోల్ మిస్సైల్ వ్యవస్థల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లైట్‌వెయిట్‌ మల్టీ రోల్‌ మిస్సైళ్లను సులభంగా తీసుకెళ్లవచ్చు. అంతేకాక హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన గిరి శిఖరాలకైనా, లడఖ్ వంటి కఠిన ప్రాంతాల్లోనైనా వీటిని మోహరించడం సులభం. లేజర్ రైడింగ్ గైడెన్స్ టెక్నాలజీతో పనిచేసే వీటి దాడులు అపూర్వమైన కచ్చితత్వంతో ఉంటాయి. అదీ కాకుండా, ట్రిపుల్ ఎఫెక్ట్ వార్ హెడ్, ప్రాక్సిమిటీ ఫ్యూజ్ వంటి వ్యవస్థలతో 6 కిలోమీటర్ల దూరం నుంచే డ్రోన్లు, హెలికాప్టర్లు, శత్రు వాహనాలను సులభంగా ఖచ్చితంగా కూల్చివేయగల సామర్థ్యం వీటికి ఉంది.

ఇదే సమయంలో అమెరికాతో భారత్‌ చేసుకున్న డీల్‌ కూడా అత్యంత వ్యూహాత్మక, అత్యవసరమైన అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు, జావెలిన్ మిస్సైళ్లు ప్రపంచంలో అత్యంత నమ్మదగిన యాంటీ-ట్యాంక్ వ్యవస్థల్లో ఒకటి. శత్రు ట్యాంక్‌ను నేరుగా కాకుండా టాప్ అటాక్ మోడ్‌లో పైనుంచి దాడి చేసి పూర్తిగా నాశనం చేసే ప్రత్యేక సాంకేతికత వీటికి ఉంది. అదే సమయంలో ఎక్స్‌క్యాలిబర్ ఆర్టిలరీ రౌండ్లు—స్టాండర్డ్ ఆర్టిలరీ షెల్ల్స్‌తో పోలిస్తే అద్భుతమైన కచ్చితత్వం కలిగినవి. ఇవి యుద్ధ భూమిలో భారత సైన్యానికి గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉంది. మొత్తం మీద… ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శక్తి సమీకరణలు మారుతున్న వేళ… చైనా తీరుతెన్నులు కఠినంగా మారుతున్న వేళ… అగ్రరాజ్యం నుంచి లభిస్తున్న ఈ అధునాతన ఆయుధ వ్యవస్థలు భారత రక్షణ వ్యవస్థను కొత్తస్థాయికి తీసుకెళ్లనున్నాయి. సరిహద్దుల్లో మారుతున్న సాంకేతిక యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్‌ తన బలాన్ని పెంచుకుంటోంది. రాబోయే రోజుల్లో ఈ డీల్ అమలు ఎలా జరుగుతుందో… అది భారత రక్షణ వ్యూహాల్లో ఎంతటి మార్పు తీసుకువస్తుందో వేచి చూడాలి.